పసరు:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
  మారేడుపురి అడవిలో జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. అధిక వృక్ష సంపద మూలంగా పండ్లు, ఫలాలతో పాటు స్వచ్ఛమైన నీరు జంతువులకు లభించసాగాయి. దట్టమైన అడవి ఉండడం మూలంగా సాహసం చేసి అడవిలోకి వెళ్లి జంతువులను చంపాలన్నా ఆలోచన ఎవరు చేసేవారు కాదు. 
                  ఒకసారి చిన్నయ్య అనే వేటగాడు జంతువులలాగా కూత పెడుతూ, నెమ్మదిగా జంతువులతో స్నేహం చేస్తూ అడవిలో తిరగసాగాడు. జంతువులు నమ్మి చిన్నయ్యతో ఆడి పాడి తిరగసాగాయి. చిన్నయ్య అడవిలో ఉన్న ప్రతి మూల అంచనా వేశాడు. చిన్నయ్య ఒక్కోసారి అడవిలో పండ్లు తింటూ జంతువుల మధ్యనే నిద్రపోతూ నటించసాగాడు.
       

ఒకరోజు చక్కని పథకంతో చిన్న చిన్న జంతువులను నమ్మించి, అడవి చివరకు తీసుకువెళ్లి, వాటన్నింటిని వలలో బంధించి, అడవి నుంచి తీసుకువెళ్లాలనుకున్నాడు. బంది అయినా జంతువులు విషయం తెలుసుకొని అరవడం ప్రారంభించాయి. అడవి చివరలో జంతువులను బంధించాడు కనుక తమ పిల్లల్ని ఎలా రక్షించాలో జంతువులకు అర్థం కాలేదు.
           చిన్నయ్య నవ్వుతూ జంతువులను వలతో పాటు భుజంపై వేసుకొని కిలకిల నవ్వుతూ అడవి నుంచి బయటకు వెళ్ళబోతూ దబ్బునా కింద పడ్డాడు. పట్టు తప్పిన వల భుజం పైనుండి కిందికి జారి, ముడి ఊడిపోవడంతో జంతువులన్నీ బయటకు వెళ్లాయి. చిన్నయ్య మాత్రం పడిపోయి స్పృహ లేకుండా ఉన్నాడు. 
            చిన్నయ్య ఒంటిపై పసరు గాట్లు ఉన్నాయి. వృద్ధ కుందేలు చిన్నయ్య ఎప్పటికైనా మోసం చేస్తాడని, ప్రతిరోజు కుందేలు పిల్లల గోర్లకు మత్తు పసరు రాసేది. చిన్నయ్య వల భుజంపై వేసుకోవడంతో కుందేలు పిల్లలు గోర్లతో గాయం చేయగా పసరు శరీరానికి వికటించి చిన్నయ్య మత్తులోకి వెళ్ళాడు. మరుసటి రోజు అడవి వద్దకు వచ్చిన జనం పడిపోయిన చిన్నయ్యను తీసుకువెళ్లి వైద్యం చేయించారు. స్పూహలోకి వచ్చిన చిన్నయ్య జంతువుల వేట మానివేసి, వాటిని చూస్తేనే భయపడసాగాడు.
 
నేను రాసిన " పసరు " కథ నా స్వీయ రచన ఎలాంటి అనువాదం కానీ అనుసరణ కానీ ఇతర పత్రికలకు పంపలేదని హామీ ఇస్తున్నాను.
కామెంట్‌లు