రాగ భావమమరే గమకాలు :- బృంద 
నవరసాలు అలవోకగా పలికించు 
మృదు గంభీర మధుర వాచకాలు 

ఏ స్థాయిలోనైనా 
తమకు తామే ఆ కంఠంలో
ఒదిగిపోయే శృతి లయలు

ఆ స్వరం నుండి వెలువడే
అదృష్టం  సొంతం చేసుకున్న 
ఎన్నో గొప్ప సాహిత్యాలు

ఆ గళంలో జీవం పోసుకుని
విన్నప్పుడంతా ఓదార్పును
ఇచ్చే ఎన్నో గీతాలు

వేయి వేణువులొక్కటిగా 
కోటి హృదయాలను ఆనందలహరిలో 
ఓలలాడించు సుమధుర కంఠ హేల

తెలుగునేలకు చిరకీర్తి నిలిపిన 

మన

ఘంటసాల

ఆ పాట మధురం 
ఆ స్వరమొక అబ్బురం
ఆ పేరు తెలుగు పాటకో వరం 

పాత పాటల ప్రేమికుల
గుండె గుడిలో ప్రతిదినం
వినిపించే ఘంటారవం.

ఆ మది శారదా దేవి మందిరం 
శివానంద లహరిని
శివశంకరితో మెప్పించిన గాత్రం

మాణిక్యవీణ చేతపట్టిన 
శ్యామలాదేవిని స్తుతించి
మెప్పించిన దైవిక స్వరం

భగవానుడు తన గీతను
వినిపించడానికి  ఎన్నుకున్న
గంధర్వ  గాయక  సుస్వరం

మోహనరూపుని  లీలలు 
సమ్మోహనంగా వివరించిన  గానం 

ఎక్కడో ఉన్న ఏడుకొండలవాని
ప్రతి ఇంట తన పాటతో
వెలయించిన  భక్తి గానం

ప్రతి అనుభూతిని వారి పాటతో 
అనుభవించడానికి
అలతి పదాల హాయైన పాటలు
బహుమతిగా పొందిన 
అదృష్టం మా తరానిది.

వారి గీతమాలలు వినడమే
వారికి నివాళిగా  భావించి
వారి పాటను ముందుతరాలకు 
పదిలంగా అందించుటే  మా ధ్యేయం

ఎన్నిమార్లు విన్నా 
వన్నె తరగని రామాయణం లా 
ఆలపించిన ప్రతిపాటా
మరిమరి వింటూ మురిసే 
మోహం మా అభిమానం

పదిమందిలో పాట పాడాలన్నా...

హృదయంలో నిదురించిన ప్రేయసిని
ఆవిష్కరించాలన్నా..

వగలరాణిని వన్నెల దొరసానిని
తలచుకోవాలన్నా..

కోరికలు తీరి జగము మధురముగా
తోచినా...

ఆనందమే జీవన మకరందమని
అవగతమైనా.....

మీ పాటలే ఆధారం ఏ తరానికైనా!

కలలో మెలకువగా 
మెలకువలో ఒక కలగా... 
మదిలో సదా వినిపించే...

మీ మధుర గీతాల సుమమాల
మా మనసులకు పాడేను  జోల

కాలప్రవాహంలో  ఎందరో 
గాయకులు వస్తారు 
పాడుతుంటారు...
వెడుతుంటారు...

కానీ ఆ ప్రవాహానికి 
తీరం మాత్రం మీరే  మాస్టారూ 🙏

నీలిమేఘాలలో
గాలికెరటాలలో
మీ స్వరం అమరం 🙏

తెలుగుపాట పాడే
ప్రతిగాయకుడు తప్పక
చదవవలసిన పాఠశాల...

తెలుగు నాట పుట్టిన
గంధర్వ గాయకులు 
మన ఘంటసాల 🙏


కామెంట్‌లు