గజిబిజి చిక్కుల రేయిలో
తికమక పడుతూ సాగేవేళ
తడబడు నడకను సరిచేసే
మినుకుమనే కాంతి కోసం
నిరీక్షణ
అలసిన కళ్లకు ఊరటలా
నడచిన కాళ్లకు విరామంలా
కరిగిన దూరపు ధైర్యంలా
చెరిగిన నిరాశ రేఖల్లా......
ఉదయం
తరిమే తలపుల తీరంలా
తరిగే దుఃఖపు భారంలా
తలచే గమ్యపు దృశ్యంలా
తగిలే కోరిన తీగలా.....
ప్రభవం
రంగులు కలలకు అద్దేలా
హంగులు బ్రతుకున వచ్చేలా
పొంగిన మనసుకు పండుగలా
బంగరు సమయం వచ్చేలా...
ప్రభావం
పుడమికి పుత్తడి పూతలతో
వనముల పచ్చని మెరుపులతో
మనమున రంగులు విరిసేలా
ముంగిట వాలిన కిరణాల
అనుగ్రహం
వచ్చిన వెలుగుల తేరులో
తెచ్చిన కానుకలేమిటో
మెచ్చిన కోరిక తీర్చగా
పచ్చగ బ్రతుకును మార్చే
వేకువ!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి