సుప్రభాత కవిత : - బృంద
కలవని తీరాల దూరం
కరగని తరగని భారం
కలిసే ఆశ లేకున్నా
కలవాలన్న కోరిక మిన్న!

మేఘాలలో నీరు చేరినట్టు 
మనసుల్లో కలతలు చేరితే
మాటలతో మొత్తం చేరిపేసి
మబ్బల్లే  కురిసి తేలికవ్వాలి

కళ్ల ముందు జలరాశి 
కనపడే నిజమే 
కడలి  లోపలి కదలికలు 
కనుగొనగలమా  ఎపుడైనా?

అంతులేని అలల పరుగులు
ఆరాటంగా అనిపించినా
అందుకోవాలనే  ప్రయత్నం
ఆగేనా ఆణువంతయినా!

మదిలో దాచిన మమతలు
మాయక మిగిలిన గాయాలు
చేరువ కాని చెలిమి తీరాలు
వెలువడని అంతరంగపు రహస్యాలు!

అంతరంగమే అంబుధి కాగా
అలజడులన్నీ అణచివేసి
ఆగుపించని అనలందాచి
అలసటగా నవ్వే పెదవులు

కదిలే కెరటాల  రాగాలతో 
భువి తాకిన కిరణాల ప్రేమతో 
తడిసే సైకత వేదికపై 
నిత్యోత్సవమే కదా వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు