సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం.

 సామెత -81 అటుకులు బుక్కే నోరు - ఆడిపోస్కునే నోరు ఊకోవు
****
" ఓ అవ్వా! బాగున్నవానే?ఏంజేత్తున్నవ్?శాన్నాళ్లయింది.నిన్ను సూడబుద్ధై  గిట్ల వొచ్చిన" కట్టె ఆస్రాతో  లోపలికొత్తున్న   శంకరవ్వను జూసి ఆచ్చిరబోతూ..."
"ఓ అత్తా! నువ్వానె ఎంత బాగ ఓపిక జేస్కోని వొచ్చినవ్! దా! దా! గీ బల్లెపీట మీద కూసో!" ఎదురుబొయ్యి శెయ్యివట్టుకుని నడ్పిచ్చుకుంట తోల్కొచ్చి కూస బెట్టి,శేతిలున్న కట్టె దీసి మూలకు బెట్టింది.
గబ్బ గబ్బ అర్రలకెల్లి శంకరవ్వకిట్టమని ఓ శిన్న గిన్నెల గీమద్దెనే కొన్న అట్కులు బోసి చేతికిచ్చింది.
గవి జూసి సంబుర పడ్తూ గిన్ని నోట్లో ఏస్కుని నవులుకుంట " ఇంగో నేను సుత గుప్పెడు కొంగుల కట్కొచ్చిన. గవి నవలక పోతే ఎంద్కోగని పండ్లు గుంజుతయే" అంటుంటే శంకరవ్వత్త సంగతి తెల్సిన అవ్వకి మస్తు నవ్వొచ్చింది. గని సూత్తె  బాగుండదని మొగం తుడ్సుకుంటున్న దానొతికె కొంగడ్డం బెట్కొంది.
కోడలా! గా చెంద్రమ్మ సంగతి నీకు తెల్సానే? అబ్బో  గీనడ్మ దాన్కి మస్తు టెంపర్ బెరిగింది. కొడుక్కి పెండ్లి జేశిన కానించి మనస్మంటోళ్ళని అస్సలు లెక్క జెయ్యట్లే. గా వొచ్చిన కోడలు పెత్తనం శేతిల దీస్కోని దీన్ని ఓ మూలకి గూసబెడ్తెగని దీని టెక్కు,టెంపరు సొంట్లెకి దిగవు."
గా మాటలినే తల్కి అవ్వ మన్సు శివుక్కుమంది. "పాపం గా చెంద్రమ్మేం జేసింది. అస్లే నోట్లో నాలికే లేంది.దాని అదృట్టం కొద్దీ మంచి కోడలు దొర్కింది. "ఏందో గీ శంకరవ్వత్త!" మన్సుల అన్కుంట "గట్లనా అవ్వా! గీ నడ్మ తనని కల్వక శానొద్దులైంది" అంది.
 "ఆఁ! అవునే కోడలా! అత్తమానం నీకు గీ ఇల్లు,పిల్లగాండ్ల జాసేనాయె.ఇంగెట్ల తెలుత్తయి తీ!" అన్కుంటనే "గా లవయ్య ముచ్చటి దెల్సానే! గిన్నేండ్లు పెళ్ళాంతో కాపురం జేసినోడు, పెండ్లాం రసరస పల్లేక,శిన్న పొల్ల పెండ్లి జేసిండో లేదో సన్నాసుల్లో గల్వడాన్కి కాశికి బొయ్యిండంట.అయిన గని గా లచ్చిమి గట్ల మొగుడు ఇల్లొదిలిపెట్టి పోయేదాంక జూస్తదా!గంత దనుక ఎవ్వలైన దెచ్చుకుంటరా?ఏందో కలికాలం.ఎవ్వుల నేమనేటట్టు లేదే!" నవుల్తున్న బుగ్గల్ని నొక్కుకుంట జెప్తున్న శంకరవ్వను జూత్తుంటే మస్తు కోపం,శిరాకొచ్చింది అవ్వకి.
"ఎప్పుడు మారుద్దో గీ అత్త? పవుతు మంది ముచ్చెట్లు,గాళ్ళ యవ్వారాలే గావాలె! గీ అత్త పోరు తట్కోలేక గాదు శివయ్య మావ శానేండ్ల కింద ఇల్లొదిలి పోయింది. గా మావ కాశిలుండో,కైలాసంల ఉండో గీ దినందాంక తెల్వకనే పాయె "గది మర్సి ఎదుటోళ్ళననుడేందో? అన్కుంది.
కోడలా! నిన్నో మాటడ్గుత గని నిజం జెప్పే! అటీటు జూసి గుసగుసగా "నీ కోడల్కి సద్వుకున్న దాన్నని కాత్త గరువం ఎక్కువంట గద!ఎప్పుడు జూశినా శేతిల ఏదో వొయ్యినో, పేపరు కాయితమో పట్కొని కూసుంటదటగ. ఇల్లెడు పని నువ్వే జేస్కోవాలంట గద!" 
గా మాటల్కి అవ్వకి సర్రున కోపమొచ్చింది గని అస్లే శాన్నాల్లకి వొచ్చింది."మాటకి మాట తెగులు నీటికి నాసు తెగులని"  తను నోట్లే నోరు బెట్టిందా! ఊల్లె అంత  జెప్పి రచ్చ రచ్చ చేత్తది."  వొచ్చిన కోపాన్ని మన్సుల దాస్కుంట...
 "ఎవలత్తా? గస్మంటి మాటలన్నది.గాళ్ళ నోరు పడిపోను.బంగారమస్మంటి మా కోడల్ని గంత మాటలంది ఎవలో జెప్పు.దాని సంగతి జూస్కుంట" నిదానంగనే గని కాత్త ఘాటుగా అంది.
 "ఇంగేముంది తేలుకుట్టిన దొంగోలె నీళ్ళు నముల్కుంట ఎవతో లే కోడలా? గాళ్ళ ఊసు మన్కెందుకు తీ!" నీ యిశయాలే ఏం దెల్వట్లేవని ఇట్లబడి వొచ్చిన.ఇంగ బోత" అని లేత్తున్న శంకరవ్వను ఆపి కోపుల శాయ బట్కొని తెచ్చిచ్చిందవ్వ.గట్లనే గీ నడ్మ జేసిన మడుగూలు,బెల్లపప్పలు ఓ  సంచిల బెట్టి తిన్మని శేతికిత్తుంటే...
 "కోడలా! నువ్వు నిజ్జంగ అన్నపూణ్ణమ్మ తల్లివే! సల్లగుండు!" అన్కుంట గవి బట్కొని కట్టె ఆస్రాతో బయిటికి నడిశింది శంకరవ్వ.
ఎల్తున్న శంకరవ్వొంక జూస్కుంట "అట్కులు బుక్కే నోరు ఆడిపోస్కునే నోరు ఓ పట్టాన ఊకోవంటే "గిదే గావచ్చు అన్కుంది.
గదండీ సంగతి. "అటుకులు తినే నోరు -ఆడిపోసుకునే నోరు ఊకోవు"అంటే గిదే. ఆగకుండా ఏదో ఒకటి మేక నవిలినట్టు నవిలేటోళ్ళు, ఇతర్ల గురించి ఏదో ఒక రకంగా ఆడిపోసుకునే వాళ్ళు కొందరుంటరు.గస్మంటోళ్ళను గురించి చెప్పిందే గీ సామెత.
కామెంట్‌లు