సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించేందుకు వినూత్నంగా గణిత సూత్రాల పార్క్, జ్యామితీయ పార్క్, త్రికోణమితి పార్క్ వంటి ప్రాజెక్టులను ప్రదర్శించారు.
విద్యార్థులు గణిత సూత్రాలు, జ్యామితీయ ఆకారాలు, త్రికోణమితి నియమాలను నమూనాల రూపంలో వివరించడంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా గణితాన్ని ప్రయోగాత్మకంగా అర్థం చేసుకునేలా ఈ కార్యక్రమం దోహదపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయిని తేనావతి గారు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, గణితం జీవితానికి పునాదని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సృజనాత్మకత, తార్కిక ఆలోచనను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గణిత ఉపాధ్యాయులు తరుణ, అపర్ణ, రాజశ్రీల కృషిని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి