భారతదేశం ఎందరో వీరులకు జన్మనిచ్చింది,వీరాంగనలకు జన్మనిచ్చింది. విదేశీ దురాక్రమణ దారుల సమయంలోనే కాదు, స్వతంత్ర ఉద్యమ పోరాటంలోను మహిళల భాగస్వామ్యం వెలకట్టలేనిది. స్వాతంత్ర్య అనంతరం దేశ అభివృద్ధిలో సైతం మహిళల పాత్ర గణనీయం. భారతదేశంలో స్త్రీ శక్తి స్వరూపిణి. ఆమె అబల కాదు సబల అనే నానుడి మనం వింటూ ఉంటాము. ఈ మాటను నిజం చేస్తూ శత్రుమూకల నుండి భారత ప్రజాస్వామ్య దేవాలయాన్ని పరిరక్షించడంలో ప్రాణాలర్పించిన వీరాంగన జీవితం ఈనాటి యువతి యువకులకు తెలియదేమో అని చెప్పవచ్చు. అటువంటి ఒక పౌరుషమయ ఘటన 24 ఏళ్ల క్రితం జరిగింది.
2001 డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడింది. కారణం ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు మీద ఉగ్ర దాడి జరిగింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పథకం ప్రకారం పార్లమెంటుపై దాడి చేశారు. రక్షణగా ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ దళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. ఆ సి.ఆర్.పి.ఎఫ్ లోనే కమలేష్ కుమారి అనే ఆడ పులి కూడా ఉంది. ఆమె ఉగ్రవాదులను అడ్డుకుంటూ ధైర్య సాహసాల్ని ప్రదర్శించి, దేశం కోసం తన ప్రాణాలను బలి ఇచ్చింది. మరణానంతరం అశోక చక్ర పొందిన ఆ వీర నారీ కమలేష్ కుమారిని స్మరించటం జాతి కర్తవ్యం.
దేశంలో అంతర్గత భద్రతకు 85 ఏళ్ల క్రితం జులై 27, 1939లో "క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్" వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత 1949 నుంచి "సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు"గా మార్చబడి సేవలు అందిస్తున్న సిఆర్పిఎఫ్ లో ఇప్పటివరకు ఒకే ఒక మహిళ అశోక చక్ర పొందింది. ఆమెనే కమలేష్ కుమారి. దేశం కోసం సిఆర్పిఎఫ్ నుంచి ఎందరో ప్రాణ త్యాగాలు చేసినప్పటికీ వారిలో కమలేష్ కుమారీది ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే పేరుగా నిలిచిపోయింది. ఎందుకంటే పార్లమెంటు మీద దాడి జరిగిన సందర్భంలో ఆమె తన ప్రాణాలు అర్పించి మొత్తం హౌస్ ను కాపాడడంలో కీలకపాత్ర పోషించింది.
కమలేష్ కుమారిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కన్నౌజ్ లోని సికిందర్ పూర్ ప్రాంతం. 1969 లో జన్మించిన ఆమె 25 ఏళ్ళ వయసులోనే అంటే 1994 లో సి ఆర్ పి ఎఫ్ లో చేరింది. కొంతకాలం 104 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లో అలహాబాదులో పనిచేసింది. ఆ తర్వాత 88 విమెన్స్ బెటాలియన్ లోకి మారింది. 2001 జూలై నుండి ఆమె ఢిల్లీలో విధులు నిర్వహిస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు విమెన్స్ బెటాలియన్ సభ్యులు సెక్యూరిటీ విధులు నిర్వర్తించడం ఆనవాయితీ. ఆ విధంగా డిసెంబర్ 13న ఆమెకు పార్లమెంటు డ్యూటీ పడింది. ఆ రోజునే పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. అప్పటికి కమలేష్ కుమార్ కి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి వయసు 9 ఏళ్ళు, రెండో అమ్మాయి వయసు ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే.
డిసెంబర్ 13 2001న ఉదయం 11:40 నిమిషాలకు ఒక తెల్ల అంబాసిడర్ కారు పార్లమెంట్ భవనంలోకి దూసుకు వచ్చింది. ఆ సమయాన లోపల అద్వానీ,సుష్మా స్వరాజ్ తదితరులతోపాటు 200 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఆ సమయానికి కమలేష్ కుమారి గేట్ నెంబర్ 11 వద్ద ఐరన్ గేట్ ఒకటి దగ్గర విధులు నిర్వహిస్తోంది. ఆ రోజుల్లో మహిళా సిఆర్పిఎఫ్ సభ్యులకు ఆయుధాలు ఇచ్చే ఆనవాయితీ లేదు. ఆమె వద్ద కేవలం వాకీటాకీ ఉంది. కారు దూసుకు రావడంతో మొదట అందరూ అధికారులు అనుకున్నారు. కానీ కమలేష్ కుమారి అది అనుమతి లేని కారు అని గ్రహించి పక్కనే ఉన్న మరో గార్డును అలర్ట్ చేసి పెద్దగా అరచి కారు వెనుక పరిగెత్తింది. అప్పటికే అందులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులు కారులో నుంచి జంపు చేసి కారును పేల్చేయాలని పథకం పన్నారు. కానీ కమలేష్ కుమారి పరుగెత్తుకొని రావడంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న లాన్ లోకి దూసుకుపోయింది. కారు పేల్చే ప్లాను కుదరక అందులో ఉన్న ఐదుగురు దిగి కాల్పులు మొదలుపెట్టారు. అప్పటికే వాకీటాకీ ద్వారా అందరిని అప్రమత్తం చేసిన కమలేష్ కుమారి ఒక నిందితులు పేలుడు పదార్థాలతో పార్లమెంటు వైపు దూసుకు వెళ్లడాన్ని చూసి వాకీటాకీ ద్వారా దళాన్ని హెచ్చరించింది. ఇంకొన్ని సెకండ్లలో అతడు లోపలికి వెళ్లేలోపల డోర్లు మూసివేయగలిగారు. గేటు వైపు నుంచి ఒకరు, లాను వైపు నుంచి మరొకరు ఆ ఉగ్రవాదిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. లేకుంటే అతడు లోపలికి వెళ్లి మొత్తం సభ్యులను ఏం చేసేవాడో ఊహించడమే కష్టం. అయితే తమ రాకను అలెర్ట్ చేసి అంతా చిన్నాభిన్నం చేసిన కమలేష్ కుమారిని ఉగ్రవాదులు వదల్లేదు. బుల్లెట్లు కురిపించారు, మొత్తము 12 బుల్లెట్స్ ఆమె శరీరంలో దూసుకుపోయాయి. ఆమె ప్రాణాలు పోయినా, మన దేశ గౌరవాన్ని కాపాడగలిగింది. పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. వీరిలో కమలేష్ కుమారి ఒక్కరే మహిళ. 32 ఏళ్ల వయసులో ఉన్న కమలేష్ కుమారి విధి నిర్వహణలో అత్యంత సాహసాన్ని చూపి బలిదానం కావటం నేటి తరానికి ప్రేరణ దాయకం. ఆమెకు 2002లో మరణానంతరం "అశోక చక్ర"ను ప్రకటించారు. నాటి ప్రధాని ఆమెకు అంజలి ఘటించారు. అశోక చక్ర అందుకున్న ఏకైక మహిళగా చరిత్రలో నిలిచిపోయింది కమలేష్ కుమారి. ఆమె చూపిన సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల అంకితభావం, దేశభక్తి వంటి ఎన్నో సుగుణాలను యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలి.
*యువతకు ప్రేరణ దారి-'అశోక చక్ర'కమలేష్ కుమారి*:- - భారతి.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి