గాలిపటం సరదా:- సరికొండ శ్రీనివాసరాజు
 వారం రోజులు పాఠశాలకు సెలవులు వస్తే పల్లెటూరిలో ఉండే రంగ పట్టణంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. తన పెద్దమ్మ కొడుకు అయిన రాఘవతో గాలిపటాలు ఎగిరేద్దామా? అని అడిగాడు. "పల్లెటూరిలో సాధ్యం అవుతుంది కానీ ఈ పట్టణంలో సాధ్యం కాదు. అన్నీ ఇళ్ళూ, షాపులే. ఎక్కడ ఎగరేస్తాం? గాలిపటం తెగిపోతే దాని కోసం వెతకడం వృథా శ్రమ. అలా గాలిపటాలు పోతుంటాయి. డబ్బులు వృథా." అన్నాడు రాఘవ. "పోయిన గాలిపటాన్ని వెతకడం సాధ్యమే. ఎంతో శ్రమకోర్చి ఆ పనీ చేయలేమా?" అన్నాడు రంగ. అప్పుడు రాఘవ వాళ్ల నాన్న రశరథ "పాపం! రంగ ముచ్చట తీరనీ! సెలవులు అంటేనే సరదాగా గడపాల్సినవి. అంతగా గాలిపటాలు తెగి ఎక్కడైనా పడితే వెతకవచ్చులే." అన్నాడు. 
     గాలిపటం కొనుక్కుని వచ్చారు. రంగ దానిని ఎగరేస్తున్నాడు. కాసేపు ఆ గాలిపటం ఎగరేస్తూ సంతోషంగా గడిపారు. కాసేపటి తర్వాత గాలిపటం ప్రమాదవశాత్తూ తెగిపోయింది. నాలుగు ఇళ్ళ తర్వాత ఉన్న ఒక ఇంటి డాబాపై పడిపోయింది. "ఆ ఇంటికి వెళ్లి, వాళ్ళను బతిమాలి మన గాలిపటం తెచ్చుకుందాం." అన్నాడు రంగ. "పోయిన గాలిపటం ఎలాగూ పోయింది. దాని కోసం పరాయి వాళ్ల ఇళ్ళకు వెళ్లి, వాళ్లని ఇబ్బంది పెట్టడం సరి కాదు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే నేను సిటీలో గాలిపటాలను ఎగురవేయడం సరికాదు అన్నాను. విన్నావా?" అన్నాడు రాఘవ. "ఎవ్వరూ ఏమీ అనుకోరు. వెళ్ళి వాళ్ల ఇంటికి వెళ్లి, మన గాలిపటం మనం తెచ్చుకుందాం." అన్నాడు రంగ. "రాఘవ చెప్పింది కరెక్ట్. ఇళ్ళ మధ్య గాలిపటాలు ఎగురవేస్తూ మన గాలిపటం ఇతరుల ఇళ్ళ మీద పడిందని వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు." అన్నది రంగ వాళ్ల అమ్మ. 
      "రేపు దూరమైనా సరే వాకింగ్ చేస్తూ ఇళ్ళు లేని ఖాళీ స్థలం చూసి అక్కడ గాలిపటం ఎగుర వేద్దాం. వీలు కాకపోతే వేరే ఆటలు ఆడుకుందాం." అన్నాడు రాఘవ. "సరేలే! మా పల్లెటూరికి మీరు వచ్చినపుడు అప్పుడు ఎగురవేద్దాం గాలిపటం." అన్నాడు రంగ. సరేనన్నాడు రాఘవ.

కామెంట్‌లు