సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము ప్రథమాశ్వాసము- * 72 వ రోజు
భీముని ఆవేదన
ద్రౌపది మాటలకు భీమసేనుడు వంతపాడాడు. " అన్నయ్యా! రాజ్యం మన తండ్రి తాతలది దానిని నీవు అన్యుల పరం చేసి ఇక్కడ ధర్మవచనాలు పలుకుతున్నావు. చెడ్డ వారిని ధర్మబుద్ధితో జయించగలమా? అది సాధ్యమా ? పరాక్రమంతో శత్రువులను జయించాలి కాని ధర్మం ధర్మం అంటూ పలవరించడం తగదు. పరాక్రమం లేని వాడు కృంగి పోవాలి కాని నీ వంటి వారు కాదు. ఆ నాడే శత్రువులను చంపి ఉంటే మనకు ఈ వనవాసం ప్రాప్తించేది కాదు. ఒప్పందాన్ని మీరు అతిక్రమించలేక పోవడం కౌరవులకు చులకన అయింది అది మన పిరికితనం అనుకుంటున్నారు. నీవు అనుసరిస్తున్న ధర్మం మనకు, మన బంధు వర్గాలకు బాధ కలిగిస్తుంది. శత్రువులను జయించడం, ప్రజల భయాన్ని పోగొట్టడం, దానధర్మాలు చేయడం, యజ్ఞయాదులు చేస్తూ బ్రాహ్మణులను పూజించడం క్షత్రియ ధర్మం. కేవలం ధర్మాచరణతో శత్రువులను జయించ లేము. మోసాన్ని మోసంతో జయించాలి. ఒప్పందాన్ని పక్కన పెట్టి వాళ్ళను జయిద్దాం. రాజులంతా మనకు సాయం చేస్తారు. కౌరవ రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు " అని భీముడన్నాడు. ధర్మరాజు " భీమా ! నీ మాటలు ధర్మ సమ్మతమే కానీ నేను సభలో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను. క్షణిక సుఖాలకు ఆశించి సత్యాన్ని ధర్మాన్ని విడువను. మనకు మేలు జరిగే వరకూ వేచి ఉంటాను " అన్నాడు. భీముడు " అన్నయ్యా ! మృత్యువు ఎప్పుడూ మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు ఆశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండుట తగునా ? మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా? " అన్నాడు." శత్రువులపై ప్రతీకారం చేయాలని నా హృదయం తపిస్తుంది. నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కుండా ధర్మం, దయా అంటూ కూర్చోవడం తగునా? నీవనుసరించే మార్గం బ్రాహ్మణులకు తగును కానీ క్షత్రియులకు కాదు. క్షాత్ర ధర్మం ప్రకారం యుద్ధం చేస్తాము. అడవిలో పన్నెండేళ్ళు గడప వచ్చు. కానీ జనపదాలలో పన్నెండు నెలలు గడపడం అసాధ్యం. జగత్ప్రసిద్ధులమైన మనం దాగుట అసాధ్యం కనుక తిరిగి అరణ్యవాసం అజ్ఞాత వాసం ఇలా ఎన్నాళ్ళు. కనుక ఇప్పటి మన పదమూడు నెలల వనవాసం పదమూడేళ్ళుగా భావించడంలో తప్పేమి లేదు " అని భీముడన్నాడు. ధర్మరాజు భీమునితో " భీమా ! నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం ఉన్నాయి. కనుక నేను చెప్పేది ఆలోచించు. కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు. కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దూకుడు తగదు. అప్పుడే మనకు దైవం అనుకూలిస్తాడు. దృతరాష్ట్రుని కుమారులు మహావీరులు పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుల అండ ఉంది. రాజసూయయాంలో మనచేత ఓడింపబడిన రాజులంతా కౌరవ పక్షాన చేరారు. కర్ణుడు మహావీరుడు, కవచకుండల ధారి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి మహా యోధులకు మనపట్ల విరోధం లేకున్న ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు. వారిని ముందుగా జయించి కాని దుర్యోధనుని జయించ లేము . కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు " అని చెబుతుండగా వ్యాసుడు అక్కడకు వచ్చాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు