పదిలపరచండి :- సత్యవాణి

 పల్లెలకెళ్ళారా? బాలలూ
పల్లెలకెళ్ళారా?
బాలలూ వేసవి సెలవలకెళ్ళారా
ఫోనులుపట్టుకు కూర్చోకుండా
పల్లెల అందం పరికించండి
సూర్యోదయముల
సొగసు వన్నెలూ
చంద్రోదయములో
వెన్నెల హాయీ
తళుకుతారలా
మెరుపుల అందము
గమనించండోయ్             గమనించండి
ఫోనులు పట్టుకు కూర్చోకుండా
ఫలవృక్షములను
పేర్లు తెలియుము
కొబ్బరి తాడుల
కొలతలనెరుగుము
తిండిగింజల పేరులనెరుగుము
పోనులుపట్టుకు కూర్చోకుండా
తామరనేస్తం
ఎవరోతెలియుము
కలువల చెలికాడెవరో నెరుగుము
రెంటితేడాను గమనించండి
ఫోనులు పట్టుకు కూర్చోకుండా
చెట్లు ఏరీతి నిద్రిస్తాయో
చెలమలేరీతి నీరిస్తాయో
గమనించండోగమనించండి
ఫోనులు పట్టుకు కూర్చోకుండా
సీతాకోకచిలుకల అందంచూడుము
తూనీగల ఫల్టీలు చూడుము
మిణుగురు పురుగుల
కాంతిని చూడుము
అబ్బురపరచే వింతలు చూడుము
ఫోనులు పట్టుకు కూర్చోకుండా             
కోడిపుంజుల మేలుకొలుపులు
కోకిలమ్మల ఘనరాగాలు               చిలుకల
పలుకుల కీరవాణులు
పిచుకపిట్టల కిచకిచ ధ్వనులు
నెమలిపుంజుల
నాట్య విన్యాసం
గమనించండోయ్ గమనించండి
ఫోనులుపట్టుకు కూర్చోకుండా
చెంగున దూకే దూడల పరుగులు
అంబారవముల ఆవుల అరపులు
మేకలమందల
మేమే అరపులు
గొర్రెలదాటులు
ఆలకించండి
అవధరించండి
ఫోనులుపట్టుకు కూర్చోకుండా
బంగారుమనసుల
పల్లెవాసులను
పల్లెభాషనూ
పల్లె యాసలను
పల్లెజీవనము
గమనించండోగమనించండి
ఫోనులుపట్టుకు కూర్చోకుండా
కల్తీలేని పాలుపెరుగులు
కమ్మని రుచిగల వెన్ననేతులు
అమ్మమ్మచేసే అప్పచ్చులను
ఆస్వాదిస్తూ ఆరగించుడి
ఫోనుపట్టుకు కూర్చోకుండా
బంధుమిత్రులతొ
మాటలుకలిపి
ఆటలుఆడీ
పాటలుపాడీ
అమ్మమ్మ కథలను
ఆలకించుచూ
తాతయ్య పద్యాలు
నెమరువేయచూఫోనులుచూస్తూ కూర్చోకుండా
నిద్రించండోయ్               నిద్రించండీ
కలతనిద్రతో కలవరించకా
కంటినిండుగా నిద్రించండి
కమ్మనైన ఈరోజులను
మనసుగదులలో పదిలపరచండి
      
కామెంట్‌లు