బానిసత్వం వారసత్వం కాదు..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ — హైదరాబాద్
బలహీనులు
బావిలో కప్పల్లా
బానిసత్వపు నీడలో
చీకటే లోకంగా
భ్రమించి బ్రతుకుతారు.
తమకిదే తరతరాల
వారసత్వమని నమ్ముతారు
బయటపడే మార్గమెతకరు

స్వేచ్ఛ…స్వాతంత్ర్యం…
న్యాయం…ధర్మం…సత్యం…
సమానత్వం...సౌభ్రాతృత్వం
సుదూరతీరాల్లో మిణుక్కుమంటూ
వెలిగే మిణుగురు పురుగులు...  

చైతన్యాన్ని కోల్పోయి
అంధకారపు ముసుగులో
ముక్కోటి కలల్నికంటూఉంటారు...
అజ్ఞానులు...విజ్ఞానం విలువను...
అంధులు.....వెలుగు విలువనెరుగరు

అందుకే...
ఓ విద్యావంతులారా…వినండి...!
చట్టాలపై గట్టి పట్టున్న మీరే…
బృహత్‌గ్రంథాల్ని పఠించిన మీరే…
శాస్త్ర జ్ఞాన సముద్రాన్ని ఈదిన మీరే…
లోకాన్ని లోతుగా అర్థం చేసుకున్న మీరే…
నవభారత సమసమాజ నిర్మాతలైన మీరే.

మీ కళ్లముందే జరుగే అన్యాయాల్ని...
అక్రమాల్ని ఎదిరించాలి…తరిమికొట్టాలి...
అక్రమార్కుల గుండెల్లో
ఆరని అగ్నిజ్వాలల్ని...రాజేయాలి...

తరతరాలుగా
గాఢనిద్రలో మగ్గే
అమాయక జనాన్ని
చైతన్యవంతుల్ని చేయాలి…
భుజం తట్టి మేల్కొల్పాలి…
వెన్నుతట్టి ముందుకు నడిపాలి...
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి...
వారికీ మీరే "దారి‌దీపాలు" కావాలి...
జనజాగృతికి మీరే "కంఠధ్వని" కావాలి.



కామెంట్‌లు