సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు
 సామెత -87:- అరవై యేండ్లు పైబడ్డోన్ని ఆలోచన అడుక్కు - ఇరవై ఏండ్లు నిండనోనికి పెత్తన మీయకు
*****
"ఏమోనే కోడలా! గీ నడ్మ మీ మావకి శాదత్తం ఎక్కువైంది.ఏం జెప్పినా గిట్లెట్ల గది గట్లనే ఉండాల్గని అంటడు.ఏదన్న ముచ్చెటి అడ్గితే ఫలానోళ్ళు గట్ల ఫలానోళ్ళు గిట్లని శెప్తనా... ఇగ జూస్కో గాళ్ళెవలో ముచ్చెటికి గీయన గరమైతడు.వాడంతే అంటడు. నీకు ఎదురు మాట్టాడ్డం శేత గాదు అంటడు. మల్ల ఎంటనే గిట్ల,గట్ల అనొద్దాని శిందులు దొక్తడు".
 "ముచ్చెటి శెప్పకుండ ఉంటే మీ అమ్మలక్కలు బాగనే శానసేపే మాట్లాడుకుండ్రు గదేందో శెప్పవేంది గంత దాప్రికమా? అంటడు.ఇంగ ఏమైన శెప్తెనేమో పైన లెక్క పంచాతి బెట్టుకున్నట్టె అరుత్తుంటడు.
 "ఎవలన్న ఇల్లు గురించో,ఇంట్లె సమెస్సల గురుంచో ఈనె సలా కోస్రం వత్తరా! ఇంగ వాళ్ళు సచ్చినట్టే అన్కో! ఎన్కటి తరా యిషయాలు జెప్పి గా లెక్కన ఇల్లైనా,ఆకిలైనా,శివరాకరికి మడుసుల బంధాలైనా గిట్లుండాలె అని"కుండ బద్దలు కొట్టినట్టు, ముక్కు సూటిగ జెప్తడు.
గా వొచ్చినోళ్ళు ఎందుకొత్తిమి? ఎందుకు గీ శాదత్తమాయన సలా అడ్గితిమి?అని సణుక్కుంట ,రంధి పడ్కుంట ఎల్తరు. ఇంగ గాళ్ళు ఎల్తూ ఎల్తూ నావొంక ఎట్లేగుతున్నవో గీయనతో అన్నట్టు జూస్కుంట బోతరు. గిట్లుంది కోడలా మీ మావ యవ్వారం. ఏం జేయల్నో తెల్వడం లేదు.
"అవునత్తా! అరవై యేండ్లు పైబడ్డోళ్ళకి ఇల్లూ ఆకిలి, పిల్లా పీసు,కుటుంబం మీద ఆపాచ్చన ఉంటది. గాళ్ళు ఇంటినిండ మడుసులు, సందడి గావాల్నని కోరుకుంటరు. గట్ల ఎవలు  ముచ్చెట్లు అడ్గినా  గా తీర్గనే శెప్తరు.గవి గిప్పటోళ్ళకి,గీ పరిత్తితులకి సాద్దెమా? కాదా ఆలోచించరు. మారిన కాలానికి  మనం మారక బోతే మన మాటలు గిట్ల ఇనేటోళ్ళకి ఇనబుద్ది గాదు. సాద్దెం కానియి చెయ్యమంటరని,అస్లు ఆలోచనే అడగొద్దు అన్కుంటరు".
 "గందుకే అత్తా"అరవై ఏండ్లు పైబడ్డోన్ని ఆలోచన అడుక్కు -ఇరవై ఏండ్లు నిండనోన్కి పెత్తన మీయకు" అంటరు.
"గద్సరేగని కోడలా! మీవంటె వొయసు మీద బడ్డోల్లం. మరి ఇరవై ఏండ్లోని ముచ్చటేంది. గాళ్ళది మాంచి ఉడ్కు రకతం గదా! గాళ్ళకెందుకు  ఇంటి పెత్తనం ఇయ్య గూడదు? నాకు తెల్వక అడ్గుతున్న కోడలా! "
 మంచి పశ్నే అడ్గినవత్తా! అయినా నీకు తెల్వక గాదు గని వొయసు పోరలకు ఓ అని దూస్కుపోవుడే గని,ఇంట్లె యవలెట్ల ఉండాలె,ఉన్నదాంట్లె ఎట్ల పొదుపుగా బత్కాలె, కట్ట సుఖాలు,మంచి శెడు లాంటి గీ విషయాలు గాళ్ళకి పురాగ ఎట్ల తెలుత్తవి? ఇంకా  చిన్నతనం బోనోల్లాయె! గాల్లే సదువుల్ల ఏదెంచుకోవాలో తకమిక లాడ్తుంటరు." 
గందుకే  మన పెద్దోళ్ళు గిస్మంటి సామెతను పుట్టించిండ్రు. మరి గీ కాలపోల్లకి  గా పెద్దోళ్ళు నచ్చరు శిన్నోళ్ళ పెత్తనం మెచ్చరు "
అంటుంటే... నిజమేనే కోడలా! మనవల్ల ఏం గాదని తెల్సినంక  నడ్మల బోవుడెందుకు.ఓ మాట అనుడెందుకు? అన్కుంట బోయింది.
"గదండీ సంగతి" అరవై ఏండ్లు పైబడ్డోన్ని ఆలోచన అడగొద్దు - ఇరవై ఏండ్లు నిండనోళ్ళకి ఇంటి పెత్తనం ఇయ్యగూడదు" అని అర్థము.

కామెంట్‌లు