ఏది నిజమైన క్రిస్మస్ పర్వదినం..?: -కవి రత్న,-సాహిత్యధీర, -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి,-అత్తాపూర్, హైదరాబాద్
వినుడి వినుడి
ఓ విశ్వాసులారా..! 
పశువుల పాకలో శిశువుగా 
బాలయేసు జన్మించిన వేళ... 
నింగిలో నక్షత్రం నవ్వింది, 
పశువుల కాపరులు పరవశించగా
ముగ్గురు జ్ఞానులు మురిసిపోయారు..!

ఓ విశ్వాసులారా..! 
ఆలకించండి...ఆలోచించండి... 
మీరు క్రిస్మస్ పర్వదినాన్ని
ఘనంగా జరుపుకునే ముందు...

మీరు ఇంటిల్లిపాది కొత్త వస్త్రాలు ధరించి, 
ముసిముసి నవ్వుల్తో మురిసే ముందు... 
మీ పాత బట్టలతోనైనా 
కొన్ని అనాధ హృదయాల్ని హత్తుకోండి..!

మీరు రుచికరమైన పిండివంటల్ని
ఆస్వాదించే ముందు, 
వీధుల్లో ఆకలితో అలమటించే 
బిక్షగాళ్ల కడుపులు నింపండి...!

మీరు చర్చిలో పాటలు పాడే ముందు, 
కష్టజీవుల కన్నీటిగాథల్ని గుర్తుచేసుకోండి.!

మీరు నిత్యం పవిత్ర గ్రంథం
బైబిల్ పఠించే ముందు...
"నీ తల్లిదండ్రులను గౌరవించు, 
"నరహత్య చేయవద్దు,
"దొంగతనం చేయవద్దు, 
"అబద్ధసాక్ష్యం పలకవద్దు, 
"నీ పొరుగువాని భార్యనైనను
"మరి దేనినైనను ఆశించవద్దు, 
"నీ శత్రువులను ద్వేషించవద్దు, 
"నిన్నువలె నీ పొరుగువాన్ని ప్రేమించు..."
"ఎదుటి వాని కంట నలుసు తొలిగించే
"ముందు నీ కంట్లో దూలాన్ని తొలగించుకో
అన్న బంగారు వాక్యాలను ఆచరించండి..!

మీరు ప్రతి ఆదివారం
చర్చిని దర్శించే ముందుగా... 
ఓ అనాధాశ్రమాన్ని దర్శించండి...
ఆ విధివంచితుల ఆకలి తీర్చండి...
ఆ అభాగ్యులను అక్కున చేర్చుకోండి...!

అది కదా నిజమైన క్రీస్తు సేవంటే... 
అది కదా నిజమైన క్రిస్మస్ పర్వదినమంటే...!

అప్పుడు
ఆ లోకరక్షకుడు... 
ఆ ప్రేమామయుడు...
ఆ కరుణామయుడు ప్రభువైన
యేసుక్రీస్తు తన కృపావరాలను...!

చిరునవ్వుల్ని...
సిరిసంపదల్ని... 
శాంతి..‌.సౌఖ్యాలను...
ఆరోగ్యం...ఆనందం...
దీర్ఘాయుష్షులను...దీవెనల్ని...
మీపై మీ కుటుంబ సభ్యులపై
కుంభవర్షంలా కురిపించును గాక..!



కామెంట్‌లు