చిరునవ్వులు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చిరునవ్వు అంటే 
మోములో పూసిన మల్లెమొగ్గ,
మదిలో మొలిచిన మమతామేఘం,
మౌనంలో మెరిసే మణిదీపం.

కన్నుల కొమ్మల్లో కాంతి కురిపించి,
చిమ్మచీకటిలో దారి చూపించి,
కలతల చీకటిని తరిమేసే
చిన్న వెలుగు రేఖ – చిరునవ్వు.

వేదనలను తరిమే వెన్నెల వర్షము,
విరహాన్ని కరిగించే మందార మకరందము,
వెడబాటును తొలిగించే సాధనము,
మనసుకు మందు – చిరునవ్వు.

అమ్మ ఒడిలో పుట్టే తొలి ఆశ్వాసం,
మిత్రుని మాటల్లో మెరిసే స్నేహము,
ప్రేయసి చూపుల్లో నర్తించే అనురాగము –
అన్నీ చిరునవ్వులే!

ఒక చిరునవ్వు చాలు
రోజంతా వెలుగు నింపటానికి,
జీవితపు బాటలో
ఆశల పూలు పూయించటానికి.

చిరునవ్వులు చిందాలి,
చీకటిని తరమాలి,
వెన్నెలను వెదజల్లాలి,
వేదనలను వెడలగొట్టాలి.

పసివాడి చిరునవ్వు -
అమ్మానాన్నలకు వెలుగు
ఇల్లాలి చిరునవ్వు -
ఇంటెల్లపాదికి దీపము.

చిరునవ్వులు 
దొర్లించు సిరులు 
తొలగించు
కష్టాలు - నష్టాలు

చిరునవ్వులు కావాలి
నిత్య నూతనము,
అనుదిన ప్రవర్ధనము,
సహస్రకిరణాల సంగమము.

చిరునవ్వులే
అందము - ఆనందము,
బంగారము - సింగారము,
ప్రకాశము - పరిశుద్ధము.


కామెంట్‌లు