భలేరాముడు :- సరికొండ శ్రీనివాసరాజు
 సోముకు ఒక చెడ్డ అలవాటు ఉంది. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో బయట షాపుల్లో దొరికే అడ్డమైన చెత్తా చెదారం కొనుక్కుని తనేవాడు. "వద్దురా! అనారోగ్యం పాలు అవుతావు. ఆ పాకెట్ మనీతో మంచి పండ్లు కొనుక్కుని తిను. ఆరోగ్యంగా ఉంటావు." అని సలహా ఇచ్చేవాడు రంగ. అయినా మనోడు వింటేనా? మూర్ఖులకు హితబోధ చేస్తే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే.
       వాసు సోము తల్లిదండ్రులకు సోము పాకెట్ మనీతో ఎలాంటి చెత్తా చెదారం కొనుక్కు తింటున్నాడో తెలిపాడు. సోమూకు పాకెట్ మనీ బంద్ అయింది. దీంతో సోము తన మిత్రులను డబ్బు బదులు అడగడం చెత్తా చెదారం కొనుక్కు తినడం మొదలు పెట్టినాడు.
      రాము చాలా బుద్ధిమంతుడు. తల్లిదండ్రులు రోజూ రాముకి పాకెట్ కొంత డబ్బు ఇచ్చేవారు. రాము ఆ పాకెట్ మనీ దాచుకునేవాడు. ఈ సంగతి సోముకు తెలిసింది. సోము రాముతో స్నీహం చేసినాడు. మాటల సందర్భంగా ప్రతీ దానికీ రామూను బాగా పొగడటం చేస్తున్నాడు సోము. ఆ తర్వాత రాము దాచుకుంటున్న పాకెట్ మనీని అప్పుగా తీసుకోవడం మొదలు పెట్టినాడు సోము. రెండు మూడు రోజుల్లో అప్పు తీరుస్తానంటాడు. కానీ తీర్చడం లేదు. రాముకు విసుగు అనిపించింది. డబ్బులు ఇవ్వవద్దు అనుకుంటాడు. కానీ సోము నటిస్తున్న అమాయకత్వానికి, తీయని మాటలకు లొంగిపోయి అప్పు ఇస్తున్నాడు రాము. 
      ఒకరోజు సోము రాము వద్దకు వచ్చాడు. రాము సోముతో "నువ్వు పరుగు పందెంలో ఎప్పుడూ ఫస్ట్ వస్తావట. నాకు ఇన్నాళ్ళూ చెప్పలేదేం." అన్నాడు. "నీకెవరు చెప్పారు?" అన్నాడు సోము. "రంగ చెప్పాడు." అన్నాడు రాము. "మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా? ఎవరు గెలిస్తే వారికి ఓడినవారు పదివేల రూపాయలు ఇవ్వాలి." అన్నాడు రాము. పదివేలా! ఓకే అన్నాడు రంగ. "ఇక్కడ నుంచి మొదలు. ఇక్కడకు కిలో మీటర్ దూరంలో ఉన్న పెద్ద చింతచెట్టు వరకు పోటీ. ఆ చింతచెట్టు వద్ద శ్రుతి అనే అమ్మాయి ఉంది. ఆమె నిర్ణయిస్తుంది ఎవరు విజేతో." అన్నాడు రాము. సరేనన్నాడు సోము పదివేల రూపాయల ఆశతో. 
       పరుగు పోటీ మొదలైంది. సోమూకు అనుమానం వచ్చింది. తనతో ఏకంగా పదివేల రూపాయల పందెం పెట్టుకున్నాడు అంటే రాము సామాన్యుడు కాకపోవచ్చు. గెలిస్తే పరిస్థితి ఏమిటి? అనుకుంటూ సోము శరవేగంగా పరుగెత్తుతూ ఉన్నాడు. కొంత దూరం పోయేససరికి శేషు కనబడ్డాడు. శేషు "ఎందుకు ఇంత వేగంగా పరుగెత్తుతున్నావు?" అని అడిగాడు. జరిగింది చెప్పి తనను ఆపవద్దన్నాడు సోము. "ఎక్కడి పందెం? ఎక్కడున్నాడు రాము?" అని అడిగాడు శేషు. చుట్టు చూశాడు సోము. కనుచూపు మేరలో ఎవరూ కనబడలేదు. రాము చాలా వెనుకబడి ఉంటాడు. తనకు గెలుపు ఖాయం అని పొంగిపోతున్నాడు సోము. "రాము నిన్ను మోసం చేసాడు. మీరు బయలుదేరిన స్థలం నుంచి గమ్య స్థానం చేరడానికి షార్ట్ కట్ దారి ఉంది. అది తెలియని అమాయకుడవు అయ్యావు." అన్నాడు వాసు. సోము రాము గెలుస్తాడు అన్న భయంతో శక్తి పూర్తిగా కూడదీసుకుని పరుగెత్తడం ప్రారంభించాడు. కంగారులో కొంత ముందుకు వెళ్ళగానే బొక్కా బోర్లా పడ్డాడు. మోకాలు చిప్పలు పగిలి ఒళ్ళంతా గాయాలు అయినాయి. ఆసుపత్రి పాలు అయినాడు. తల్లిదండ్రులతో బీభత్సమైన తిట్లు తిన్నాడు. ఆ తర్వాత రాము గెలిచి ఉంటాడు పదివేల రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని రామును తప్పించుకుని తిరుగుతున్నాడు. రాముకు తలనొప్పి తగ్గింది. 


కామెంట్‌లు