సాహితీ తరంగాల స్నిగ్ధ వీచికలు:- బి.ఉషారాణి-మంచిర్యాల
సాహితీ కెరటాలు
సాహితీ కవి కళా పీఠం
===============
అక్షరాల మధుర ధ్వనుల్లో
నిద్రలేచే నిశ్శబ్ద క్షణాలు,
మనసులో ముసురుకున్న
అనుభూతుల ప్రవాహాలు,
మెల్లగా ఊపిరి పోసుకుని,
పదాల పదనిసలను సృష్టిస్తూ,
వాక్యాల వెంట పరుగులెట్టే
హృదయ స్పందనలు.

ప్రతి పలుకులో దాగున్న
మధుర భావ కణాలు,
అంతరంగపు నిట్టూర్పులు,
అనుభవాల సారములు,
మరువలేని జ్ఞాపకాల
మధురమైన విత్తుల నుండి
చిగురించిన మొలకలు.

ఓ పువ్వు వికసించినట్లు,
ఓ నవ్వు పరిమళించినట్లు,
ఓ వేకువ ప్రభవించినట్లు,
ఓ ఆశ చిగురించినట్లు,
స్పృశించలేని హృదయ
భావ తరంగములై,
ఉల్లాస గాన మధురిమలై,
ఉప్పొంగే సాహితీ తరంగాల
స్నిగ్ధ వీచికలు.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌