సామెత -74 : అర్తం లేని బతుకు ఎర్తం
****
"అవ్వా! నువ్వేమన్నన్కో! మొగం జూసి బొట్టు వెడ్తరు... చూసి పీటేత్తరు. గవ్వి రెండు నాకు లెవ్వనే గద మొన్నెంత అగుమానమయ్యిందన్కున్నవ్.గాళ్ళ బుద్ధులు మొదట్నించి నాకెరికే అవ్వా! గందుకే నే సచ్చినా రానని మా ఇంటాయన్తో అంటే ఇంటెనా? శెవి మీద పేను పార్నట్టు లేదు నామాట.ఇంగిట్ల గాదని గాయికెత్తుకుంటె గప్పుడన్డు.'గాళ్ళు మనం పాలోల్లం. ఎళ్ళకపోతె ఏడ్చి సత్తరు. నాకు సుత పోవుద్దిగాట్లే గని తప్పదే' అన్కుంట సన్నాయి నొక్కులు నొక్కి తోల్కబొయ్యిండు.
ఇంతకెవలి ముచ్చటి జెప్తున్నవే కోమలీ? ఏమైందో జెర తల్కాయకెక్కెటట్టు జెప్తెనె గద తెల్సేది? అవ్వ మాటల్కి...
"గదా! మా మాంగారి పెద్నాయన నడ్పి కొడ్కింట్ల పెండ్లవ్వా!గక్కడి ముచ్చట్నే. మన్సు జంప్కొని ఎల్లినందుకు తగిన శాత్తయ్యింది."
గా ఇల్లు వైబోగం జూస్కొని మిడ్సిపడ్తుండ్రన్కో. గాయ్న కోడండ్లు నన్ను నా వోల్కాన్ని ఎగాదిగా జూసుడు. అక్కా బాగున్నావ? శెల్లే ఎట్లున్నవని ఎవత్తిని అడ్గినా నేనెవలో అస్సలు దెల్వనట్టు జేసిండ్రు.గాళ్ళ మా మావొత్కె మా మావ గుట్టల్ గుట్టల్ సంపాదిచ్చి పెట్లే. గాయ్న అదృట్టం బావుంది.బూవి అమ్కొని యాపారంల బెట్టిండు కల్సొచ్చింది.ఎనక్కి తిర్గి జూడకుండ సంపాయించిండు. గదీ గాల్ల టెంపరు,మిడ్సిపాటు... వొక్కలంటె వొక్కలన్నొచ్చి మర్యాజ్జెయ్యలే... తల్సుకుంటె రత్తం తుక్క తుక్క ఉడ్కుతుందన్కో!"
"అవునే కోమలీ!ఎన్కటోళ్ళు ఊకెనె అన్లే"అర్తం లేని బత్కు ఎర్తం":అని గాళ్ళకి పైసలు గన్పడే తల్కి కండ్లు ఉష్కె దొంతుకొచ్చినట్టొచ్చినయ్.గీ కాలం గాల్లదేనే? ఓ మంచి మర్యాద యాడుంది.పైసలున్నోడిదే పైశేయి గీకాలంల.
"ఐతే ఒక్కటి మతికుంచుకో గిస్మంటోళ్ళ గురించి ఓ కత సుత ఉంది. ఎప్పట్కైనా నీ యిలువ దెల్వక పోద్ధా?నీ అవుస్రం రాకపోద్దా? అయిన గని గీ ఊల్లెకొత్తె తెలుత్తది.నువ్వు నీ మంచితనం. శివరాకర్కి మిగిలేది మాట మంచితనమే. శెప్పినంద్కు ఎల్లినవ్. మీ ఆయ్న మాట దక్కించినవ్. రంది పడ్కే తల్లీ!
గా కతేందో శెప్పవ్వా!అన్నకోమలి మాటల్ల కత అని శెవుల బడంగనే భూలచ్మి రివ్వున పచ్చోలె అవ్వ తానకొచ్చి కూసుంది.
ఎన్కటికి ఓ పెద్దాయన్ని ఇంకో పెద్దాయన మద్దేనం యిందుకు రమ్మని పిల్శిండంట.గీయనస్లే సాదా సీదా మణిషి. గట్లనే వోయిండంట. గా ఇందుబెట్టే కాడ కాప్లా దార్లని బెట్టి ఏరే జెనాలు ఎవలు రాకుండా కట్టడి జేసిండ్రంట. ఇంగేముంది ఆ పెద్దాయిన్ని లోపల్కి ఎల్లనియ్యక గిస్మంటి సాదా సీదా మన్షులని లోన్కి రానివ్వమంటే ఎంటనే గిరుక్కున తిర్గి గా పెద్దోళ్ళ బట్టలు ఇస్త్రీ జేసే తానకి బొయ్యి బెమ్మాండమైన కోటును అద్దెకు తీస్కొని ఏస్కొని బోయిండంట. మన్షి కోటుతో ఉన్న ఆకారం జూసి అతి వినయం జూపుకుంట లోపలికి పంపిండ్రంట.
గక్కడ మాటల్లో బోజనాన్కి పిల్సినాయనతో గీ యిసయం జెప్పేతల్కి గంత పెద్ద మడిషిని గట్ల ఆపు జేత్తరా? అని కాప్లా ఉన్నోళ్ళ మీద గరంమైండంట. గదీ సంగతి! అర్తం ఉండాలె గని అహం పెర్గనియ్యొద్దు. అర్తం లేని బత్కు ఎర్తం ఏం కాదు.మన్ల ఉండాల్సింది "సదువు సంస్కారం మంచితనం,ఇతర్లకి సాయం చేసే గుణాలు". గివ్వే అర్తాన్ని మించిన పేరు తెత్తయి.గివి లేని బత్కు ఎర్తం అర్తమైందా ?"అంటుంటే కోమలితో పాటు భూలచ్మి సుత బుద్దిగా తలూపింది.
గదండీ సంగతి! "అర్తం లేని బత్కు ఎర్తం" అని కట్టమొచ్చినప్పుడు అన్కుంటం గని అస్లుండాల్సింది పైన జెప్పినట్లు మంచి గుణాలు.గవి లేకుంటేనే మడిషి బత్కు ఎర్తం. గా సంగతి మనందర్కీ తెల్సు గద ఏది శాశితమో!"


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి