సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం

 సామెత -80:-అందరూ అందలమెక్కితే మోశేవాళ్ళు యెవరు?
****
"అవ్వా!గిదేమన్న నాయంగుందా? నువ్వే సెప్పు. ఇంట్లె అందరూ ఆరాంగ మంచాల మీదికి కంచాలు తెప్పించుక తింటున్నారు. నేనీ ఎట్టి జెయ్యలేక సత్తున్నవ్వా! నేనో మడిషన్నదే మర్శిపోయిండ్రు. అంత్రం లెక్క ఇరాం లేకుండా పన్జేయిత్తుండ్రు. శేషి శేషి రెక్కలు అరిగి పోతున్నయి. ఒంట్లె కూసింత సుత సత్తువ లేకుండా బోయింది. నా కట్టాలు ఎప్పుడు దేవునికి సుతి ముడ్తయో...?" కళ్ళు, ముక్కు తుడ్సుకుంట రాంబాయి జెప్తున్న మాటల్కి అడ్డు తగుల్తూ...
"అది కాదే రాంబాయీ!  గాళ్ళేం మడుసులు?గట్లెందుకు నిన్ను ఏడిపిచ్చుకు తింటున్నరు? నువ్వు మాత్తరం ఎంతకని శాకిరి జేత్తవు? నువ్వు సుత కొప్పెత్తెయ్.గప్పుడు గని ఆళ్ళకి తెల్సి రాదు."
 అవ్వా! గట్ల సుత ఓ త్యేప పడిశం, జొరంతో పది దినాలు మంచం నేశిన. అయ్యో అన్నోడు లేడు.కుయ్యో అన్నోడు లేడు. "దాశిన మొగుడా ఏరుండు " అన్న తీర్గ  దాశ్న డబ్బుల్ని ఆగం బట్టించిండ్రు."పోశెమ్మ లెక్క పోగు జేసిందంత మైసమ్మొతిక  మాయం చేసిండ్రు". గిట్ల"ఆరొద్దుల సంసారం మూడొద్దులు జేసి" కూసుండ్రు.
"అయ్యో గట్లనా శెల్లె! అందరూ అందలమెక్కితే మోశెటోళ్ళు ఎవరంట?" గట్ల మారాజులొతికె కూసోని తింటే కొండలు సుత కర్గుతై. గదేమో గని నీకేమన్నైతే ఎవలు చేత్తరు.
ఎవలి పని గాళ్ళు శెయ్యాలె. ఒకని కొచ్చిన పని ఇంకోనికొత్తదా? ఒకడు జేసే పనిల ఇంకోడు ఎందుకు అందుల తల్కాయ బెట్టాల ? నువ్వు గిప్పట్నుంచి శేతనైంది శై. గంతే గని ఒళ్ళు అలిష్ట గానీయకు. నువ్వడ్డం పడ్తే శేశేటోడు ఎవ్వడుండడు.
" అక్కడే కూసోని సద్వుకుంటున్న భూలచ్మి ,బుడ్డోడు వొచ్చి "అవ్వా! అవ్వా అందలమంటేందో శెప్పవా!" అడ్గుతుంటే .. మీరు సామాన్నులు కార్రా! అన్ని ముచ్చెట్లు మీకే కావాలి అన్కుంట  యివరంగ సెప్పడం మొదల్వెట్టింది...
 అందలం అంటే ఎన్కట పెండ్లిపిల్ల,పెండ్లి పిలగాడ్ని కూసుండ బెట్టి ఊరేగించే పల్లకి రా! గదాన్ని మొయ్యాలంటె మణుసులు గావాలె.నాల్గు అయిపుల పొడుగు పొడుగు కర్రలుంటై. మద్దెల పెట్టె లెక్క గాలి పోయేటట్టు కిటికీల్లెక్క ఉంటయి.గా దాన్ని మెరిసే మెరిసే తెల్ల తెల్ల పూసల్తో షోకు జేత్తరు. బాగున్నోళ్ళు  అంటే మస్తు పైసలు ఉన్నోళ్ళు గా పల్లకిలా అత్తింటికి, అయ్యింటికి తిరుగుతుంటరు.సూట్టానికి మస్తుంటది గని గా మోసేటోళ్ళని సూత్తుంటెనే పాపం అనిపిత్తది.
అయితే గట్ల మోసేటోళ్ళకి సుత గా పల్లకిల ఊరేగాలనుంటే ఇంగ ఎవలు మోత్తరు గా పల్లకిని అని  గీ సామెత అర్తం. అయితే గీ దీన్నే ఇంకో తీర్గ సుత జెప్తరు. ఎవలి పని ఆళ్ళు శేయకుండ గట్ల పల్లకిల కూసోని సుఖంగా తిర్గాలన్కుంటే మిలిగిన పన్లు ఎవలు సేయాలే?
గట్ల ఇంట్లె ఒక్కలి కట్టం మీద మిలిగినోళ్ళు వొల్లు కద్లకుండ కూసోవడం తప్పని శెప్పేందుకు గీ సామెత బుట్టించిండ్రు.
"అవ్వా!అవ్వా! మా బల్లె సార్లు ఓ పాలి గిట్లనే జెప్పిండ్రు. మన పెయ్యి ఉంది గద గీ దీంట్లో కండ్లు, ముక్కు,సెవులు , కాళ్ళు సేతులు ఉన్నయి గద.గవి ఎవలి పని అవి శెయ్యక పోతే ఎంత కట్టమో శెప్పి,వాటన్నింటొతికె మనమంత  ఎవలి పని గాళ్ళు శెయ్యాలె, గట్ల కల్సిమెల్సి ఉండాలని చెప్పిండ్రవ్వా..." 
 మా బాగ శెప్పినవే భూలచ్మీ! "అందరూ అందలమెక్కితే మోశేవాళ్ళు యెవరు" అంటే గిదే మరి. అనంగనే భూలచ్మి  తను శెప్పింది రైష్ట్ అయ్యిందని మస్తు సంబుర పడింది "
గదండీ సంగతి"అందరూ అందలమెక్కితే మోశేవాళ్ళు యెవరు" అంటే కాత్త కూత్త దెగ్గరగా గిదే అర్తం.

కామెంట్‌లు