సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!- * 84వ రోజు
నలదమయంతులు రాజ్యాన్ని పొందుట
నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు. నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను, నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి, ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో "పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను, నీబలం వలన కాదు. నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు. ఇంకా బృహదశ్వుడు నలచరిత్ర విన్నవారికి కలిదోషములు ఉండవని నాగుడైన కర్కోటకుని, దమయంతిని , నలుని , రాజర్షియైన ఋతుపర్ణుని తలచిన వారికి కలిబాధింపదని
* ఈ శ్లోకము చెప్పాడు కర్కోటకస్య నాగస్య దమయంత్యాః*
నలస్యచ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం
ధర్మరాజు వద్దకు నారదుని రాక
మహాముని బృహదశ్వుడు నలచరిత్రను ధర్మరాజుకు తెలిపి "ధర్మరాజా! జూదంలో కోల్పోయానని బాధపడకు. నీవు దైవ సహాయంతో, నీ స్వప్రయత్నంతో విజయం సాధిస్తావు " అని ధైర్య వచనాలు పలికి తన వద్ద ఉన్న అక్షవిద్యను ధర్మరాజుకు చెప్పి వెళ్ళి పోయాడు. ధర్మరాజు అర్జుని కోసం నిరీక్షిస్తున్న సమయంలో అతని వద్దకు నారద మహర్షి వచ్చాడు.ధర్మరాజు నారదునికి అతిథి మర్యాద చేసాడు. ఆ యనను చూసి ధర్మరాజు " మునీంద్రా నాకు ఒక ధర్మ సందేహం ఉంది. తీర్చగలరా ?" అని అడిగాడు. నారదుడు నవ్వి అలాగే అడగమన్నాడు.ధర్మరాజు " ఈ భూమిలో తీర్ధములు సేవించిన ధన్యులకు ఎలాంటి ఫలితం కలుగుతాయి " అని నారదుని అడిగాడు.నారదుడు ధర్మరాజా చెబుతాను విను " పూర్వం భీష్ముడు గంగాతీరంలో వేదాధ్యనం చేస్తూ చాలా మంచి పనులు చేసూ ఉండే వాడు. భీష్ముని వద్దకు ఒక సారి పులస్త్యుడు అనే ముని వచ్చాడు. అతనికి అతిధి మర్యాదలు చేసిన పిమ్మట భీష్ముడు పులస్త్యుని చూసి నీవు నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ మహర్షి భీష్మునితో చెప్పిన విషయాలు నీకు చెప్తాను " అని ధర్మరాజుతో అన్నాడు
తీర్ధ మహిమ
ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరుల నుండి ఏమీ ఆశించని వారు మిత భోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారుఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎన్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం.దాన ధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు ఔతారు.అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయ లేరు. కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు. సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్థం ప్రసిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పష్కరంలో పది సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యం, యయాతి పతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్థం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నానం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది. వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నానం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్థంలో శివుని పూజించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్థం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్థంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి