అక్షరమెరుపులు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మదిలో మోగిన మౌనాన్ని     
మెరుపుల్లా చిలికే అక్షరాలు –
చీకటి ఆలోచనల గగనాన్ని
వెలుగుల వర్షంతో తడిపేమంత్రాలు.

కలల కాంతులు కవితలై జారితే,
కలముని ముంచి వెలిగే భావనలే
అక్షర మెరుపులై మెదులుతూ
మనసు నేలపై పండే ఆశలపంటలు.

ప్రతి పంక్తిలో ఓ పులకింత,
ప్రతి పదంలో ఓ ప్రాణం,
నిశ్శబ్దాన్ని నాదంగా మార్చే
నవజీవన నాదమే అక్షరప్రకాశాలు.

కవిగారి కలల కిరణాలు
లోకానికి వెలుగు పంచితే –
చీకటిని చీల్చే చిరునవ్వులై
పదాలు పూయించేను అక్షరపువ్వులు.

అక్షర మెరుపులు పడే చోట
హృదయాలే పుణ్యక్షేత్రాలు,
కవితలే కాంతి దీపాలు,
ప్రపంచమే ఆయ్యేను భావాలమందిరము.


కామెంట్‌లు