సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -67- అపురూపాల పిల్ల పుడితే ఆందెంతో.... కడిగిందట
****
అవ్వింట్లె శానా శానా సందడిగుంది.శాన్నాళ్ళకి ఆడివిడ్డ సుక్కమ్మ తన బిడ్డ సుభద్రని,ఆమె సంటివిల్లని తోల్కొనొచ్చింది.
గా సంటివిల్లను జూసేతల్కి భూలచ్మి, బుడ్డోడికి ఎక్కల్లేని సంబురమేసింది.బడికి సుత పోబుద్ది గాలె. అమ్మ నాయిన తిడ్తరని శిన్నగవొయ్యి అవ్వని కాకా బట్టి బడికి ఎగనామం బెట్టిండ్రు.
సంటివిల్ల ముద్దు ముద్దు మాటల్తో గున్న గున్న నడిమింట్లె నడుత్తుంటె కాళ్ళకి గట్టిన గజ్జెలు గల్లుగల్లు మంటున్నయ్. గా పిల్లని సంబురానికి ఎత్తుకోనీకి బుడ్డోడు,భూలచ్మి నేనంటే నేనని పోటీ పడ్కుంట దెగ్గిరకు ఎల్లబోతుంటె ఉర్రికొచ్చి  "అయ్యయ్యో!గట్ల ఎత్తుకోకూడదు. ముందుగాల మీ శేతుల్ని సుబ్బరంగా డెట్టాలుతో కడుక్కొని రాండ్రి!" అన్న  సుక్కమ్మ మాటల్కి ఉలిక్కిపడి బిక్కమొగాలేస్కుని గంత దూరాన ఆగిపోయిండ్రు. గిదంత సూత్తున్న అవ్వ మన్సు శివుక్కుమంది.
ఇంగ బుడ్డోడు , భూలచ్మి అన్నాలు దినేకాడ్కి గా బుడ్డపిల్లొచ్చి ఆఁ అని నోర్జాపుతుంటె శిన్న పొల్లగాండ్లు గద.గంతకు ముందు జర్గింది మర్సిపోయిండ్రు. ఏడి ఏడి అన్నం మెత్తగ జేసి తీయపప్పు, నెయ్యి కల్పి శిన్న ముద్ద జేసి నోట్ల బెట్ట బోతుంటె   ఉయ్యాల బల్ల మీద కూసున్న సుభద్ర ఒక్కంగలో వురికొచ్చి "పిల్లనేమన్న చేత్తరా ఏంది? ఏది బడ్తె అది బెడ్తె పిల్ల ఆలతు పాడైద్ది." అన్కుంట పిల్లని గక్కన్నుంచి లాక్కొని బోయింది.
గజ్జూసి భూలచ్మి, బుడ్డోడు భయపడిండ్రు. ఏడ్పు మొగం బెట్టి  " మేం ఏది బడ్తె అది పెట్లే.తియ్యపప్పు నెయ్యన్నమే పెట్టబొయ్యినం" అంటుంటే గాళ్ళిద్దరి కండ్లల్ల నీళ్ళు చెంపలమీద్కి దూకినయి.
 "అక్కన్నే వాళ్ళ అవసరాలు జూస్తున్న అవ్వకి మస్తు కోపమొచ్చింది.శిన్నపిల్లలని సుత సూడకుండ త్యేప త్యేపకి గాళ్ళని కసిరిత్తుంటే తట్ట్కోలేకపోయింది.రాని నవ్వు మొగం మీద్కి దెచ్చుకొని " భూలచ్మి బుడ్డోడి తానకి బొయ్యి "అప్రూపాల పిల్ల పుడితే ఆందెంతో... కడినట్టుంది" గాళ్ళ యవ్వారం. మీరింక గా పిల్ల జోలికి పోకుండ్రి" అని గుసగుసగ జెప్పింది.
 మద్దేనం పూట అవ్వ వొద్దన్నా ఇనకుండ బుడ్డోడు, భూలచ్మి బల్లెకెళ్ళిపోయిండ్రు.
ఇంగ గా సంటివిల్లని తినేకాడ ,తాగేకాడ  అప్రూపం జేసుడు. ముట్టుకుంటే కందిపోద్దేమోనని,పట్టుకుంటే పసిపిల్లకి ఏమన్నైద్దేమోనని అన్నింటికి అతి జేత్తుంటె సూసేటోళ్ళకి శిర్రెత్తుకొత్తున్నది. సూశి సూశి నోరెక్కడ జార్తనో అని ఉగ్గబట్టుకుంది అవ్వ.
 "ఎంత లేక లేక పుడితే మాత్తరం మరీ గంత అప్రూపమా!గిట్లనే చేత్తె పిల్ల పెరిగినంక ఇంగెక్కడన్న యిమడగలదా?ఇంగెవలన్న మాటింటదా?... వాళ్ళు వత్తున్నరంటె ఎంత సంబ్రమైందో... గిప్పుడు మాత్రం ఎప్పుడెళ్ళిపోతరా? అన్పించింది అవ్వకి.గట్లనే భూలచ్మి, బుడ్డోడ్ని తల్వంగనె మస్తు బాదన్పించింది.
శిన్న పిలగాండ్లంటె ఎవలికి సంబ్రముండదు? పిల్లగాండ్లద్దరు ముద్దు జేత్తుంటె గట్లనేన కస్రుకునేది.పాపం ఇయ్యాలంత ఇంటికాడ ఉండాలనుకున్నోళ్ళు...గాళ్ళ శెకలకి డంగైపోయి బల్లెబడ్డ దనుక పోయిండ్రు..." గియ్యన్ని దల్సుకుంట వంటింట్లె సగబెడ్తున్నవ్వతో "ఇంగ పోయొత్తం" అన్కుంట ఉన్న ఫలానా పయాణమైండ్రు.
 గాళ్ళ శెకలన్ని తేడాగ అన్పించినా "ఒక్క నాటి మాట బత్కంత యాదికుంటదని కిమ్మనకుండ ఉండి పోయింది.
ఇంగ గాళ్ళు పోతుంటే "ఒక్క దినమే గీళ్ళను బరించలేక పొయిన.ఎల్లిపోయిందే మంచ్చిత్తీ అనుకుందవ్వ.
 "గాళ్ళున్నంత సైమం కడకడలు దిర్గిన భూలచ్మి,బుడ్డోడు, గాళ్ళట్ల  ఎల్లంగనే అవ్వకాడి కొచ్చి "అవ్వా! అవ్వా! మేం అన్నం తినేటప్పుడు"అప్రూరూపాల పిల్ల పుడితే...అన్కుంట ఆపినవ్. జర గదేందో జ్జెప్పవ్వా?
 "ఓసోష్!గదారా? ముచ్చటంటె శెవి గోస్కంటరు గద మీరు. సరే తీ!
ఇంగ అసలిషయానికొత్త.పొద్దుగాల వొచ్చిన సుట్టాల తీర్గ.ఎనకట ఒకామెకి లేక లేక శాన్నాల్లకి బిడ్డ పుట్టిందంట.అందొరితికె కాదు. గామె తన బిడ్డను పత్తేకంగా పెంచాలని సూశిందంట.ఇంగ ఓ పాలి గా బిడ్డ ఇష్షి బోతే ఎవలైన నీళ్ళతో గద కడ్గుతరు.గాళ్ళొతికె నీనెందు కడగాలె అన్కొని ఆందెంతో కడిగిందట్రా."
గీ ముచ్చటి జెప్పంగనె భూలచ్మి  "ఎబ్బే"షీ! షీ! షీ!" గా నూనైతె జిడ్డు జిడ్డుగ శేతికంత అంటుద్ది గదవ్వా!సబ్బుతో కడ్గిన సుత పోనే పోదు.అన్కుంట పక్క పక్క నవ్వబట్టింది‌. బుడ్డోడికి ఏమర్తం కాకపొయ్యినా అక్క నవ్వుతో శుతి గల్పిండు."
"గదండీ సంగతి! "అపురూపాల బిడ్డ పుడితే ఆందెంతో...కడగడం"అంటే గిదే మరి.దీన్నే అతి జేసుడంటరు.
కామెంట్‌లు