వారే వీరులు...విప్లవకారులు..!:- కవి రత్న-సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
కులం…మతం…
మొన్న ఒక అవసరం
నిన్న ఒక అభిమాన వేడుక
నేడు అహంకారానికో అగ్నిగోపురం...

కులం…మతం…
రెండు నేడు అదృశ్యంగా 
ఆరక రగిలే అగ్నిగుండాలు... 
రాజకీయాలకు రథచక్రాలు... 
అధికార పీఠాలకు అక్షయ పాత్రలు...

కులం...మతం...
కొందరు అవినీతిపరులకు 
ఆశబోతులకు అహంకారులకు
పండే పచ్చని పంటలు 
కొందరికి చీకటిలో చితిమంటలు...

కులం...మతం...
ఒక స్వార్థం…అది వ్యర్థం…
కాదది సమతామార్గంలో నడిచే 
సత్యవంతుల జీవిత పరమార్థం...
కాదది సంఘసంస్కర్తల జీవన యజ్ఞం...

కులాల కుడ్యాలు కూలిననాడే...
మతమౌఢ్యాన్ని మట్టుపెట్టిననాడే...
అసమానతల అగాధాన్ని
సమాధి చేసిననాడే...
కత్తికి పదునుపెట్టి అక్రమాలకు 
అణచివేతలకు చరమగీతం పాడిననాడే...

నయవంచకుల 
గుండెల్లో నిదురించిననాడే...
అభివృద్ధి నిరోధకుల్ని ఎదిరించిననాడే...

సమాజాన్ని జలగల్లా పట్టిపీడించే
చీడపురుగులను ఏరి పారేసిననాడే...
అంధవిశ్వాస భూతాల్ని తరిమికొట్టిననాడే...

తాడిత...పీడిత...బడుగు 
బలహీన వర్గాల చీకటి బ్రతుకుల్లో 
చిరుదివ్వెలు...వెలిగించిననాడే....
అభ్యున్నతికి అస్త్రాలు సంధించిననాడే...
నాడే నవసమాజ నిర్మాణానికి పునాది...
నాడే అంబేద్కర్ ఆశయాలు సిద్ధించేది...

అందుకై...
నిస్వార్థంంగా శ్రమించే 
ప్రాణత్యాగం చేసే వారంతా… 
శూరులే...సూర్యులే… 
వీరులే...విప్లవకారులే…
చిరంజీవులే…సదా చిరస్మరణీయులే...



కామెంట్‌లు