తమిళంలో ప్రసిద్ధి ప్రవచన కర్త కృపానంద వారియార్ చెప్పిన ఓ చిన్న కథ.
ఒకానొక రోజు ఒకడు కృపానంద వారియార్ వద్దకు వచ్చాడు. ఆయనకు నమస్కరించి "అయ్యా! నేనీ కళ్ళతో దేవుడిని చూడవచ్చా?'' అని అడిగాడు.
అయితే కృపానంద వారియార్ "నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, నేనొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పు సోదరా! నీ ఈ శరీరాన్ని నువ్వు కళ్ళతో చూస్తున్నావా?" అని అడిగారు.
"ఏమిటి సార్! నేనేమన్నా మూర్ఖుడినా? ఏమిటీ ప్రశ్న? నాకు కళ్ళున్నాయిగా, నేనెందుకు చూడలేను? నేను చాలా కాలంగా ఈ శరీరాన్ని చూస్తూనే ఉన్నాను.'' అని అతనన్నాడు.
"సోదరా! నేను నిన్ను మూర్ఖుడవని అనేదే...నువ్వు పండితుడివే కావచ్చు. కానీ నువ్వు చదువుకున్న జ్ఞానం స్పష్టంగా లేదు. కేవలం కళ్ళుంటే సరిపోదు. కళ్ళల్లో కాంతి ఉండాలి. చెవి ఉంటే సరిపోదు?
చెవి శబ్దాన్ని వినగలగాలి. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. దానిలో సూక్ష్మత, దృఢత్వం ఉండాలి. నీ విషయానికే వస్తాను. నువ్వు నీ శరీరాన్ని చూస్తున్నావు. బాగానే ఉంది. అయితే నువ్వు నీ మొత్తం శరీరాన్ని చూస్తున్నావా?'' అని అడిగారు వారియార్.
అప్పుడా వ్యక్తి "అవును. నా దేహం నాకు చాలా బాగా కనిపిస్తోంది. ఇందులో సందేహమేముంది'' అన్నాడు.
"సోదరా! తొందరపడకు. బాగా ఆలోచించి చెప్పు...నీ శరీరం మొత్తాన్ని చూస్తున్నావా?"' అని అడిగారు వారియార్.
"ఏమిటి సార్! నేను చూస్తున్నాను... నేను చూస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నా... ఎన్నిసార్లు చెప్పాలి... ప్రతిదీ కనిపిస్తోంది?'' అన్నాడు యువకుడు.
"సోదరా! అన్ని భాగాలూ చూడగలుగుతున్నావా?''
"అవును! అన్నీ కనిపిస్తున్నాయి.''
"మొత్తం భాగాలు కనిపిస్తున్నాయా?''
అతను గొంతు పెంచడమే కాకుండా కొంచెం చిరాకుగా, "అన్నీ పూర్తిగా కనిపిస్తున్నాయి" అని అన్నాడు.
"సోదరా! నీ శరీర వెనుక భాగం నీకు కనిపిస్తోందా?" అని వారియార్ అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. ఔను కదూ...శరీరం నాదే...కానీ వెనుక భాగాన్ని ప్రత్యక్షంగా చూడలేను గా అనుకుని "సార్! వెనుక భాగం కనిపించదు" అన్నాడు.
'అదేంటి సోదరా! మొదట అన్నీ చూస్తున్నాను అని చెప్పింది నువ్వేగా. ఇప్పుడు వెనుక భాగం కనిపించడం లేదు" అని అంటున్నావు. అంతెందుకు, కనీసం ముందు భాగం మొత్తం చూడగలుగుతున్నావా?'' అని అడిగారు వారియార్.
"ఔను...ఇందులో ఆలోచించడానికి ఏముంది? ముందు భాగం మొత్తం కనిపిస్తోంది.'' అన్నాడతను.
"అలాగా సోదరా! తొందరపడకు. ముందు భాగంలో ఉన్న అన్ని భాగాలను చూడగలుగుతున్నావా? నెమ్మదిగా ఆలోచించి చెప్పు....'' అన్నారు వారియార్.
"ఔను, అన్ని భాగాలూ కనిపిస్తున్నాయి.....'' అన్నాడతను.
"సోదరా! మళ్ళీ చెప్పు. అన్నీ కనిపిస్తున్నాయా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు.'' అన్నారు వారి యార్.
"అవును! ఆలోచించే చెప్తున్నానండి.... ముందున్నవన్నీ కనిపిస్తున్నాయి." అన్నాడతను.
"సోదరా! ముందున్న ముఖ్యమైన భాగమైన ముఖాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? అద్దంలో చూసుకుంటే కనిపిస్తుందిగా అనకు...వొట్టి కళ్ళతో ముఖాన్ని చూడగలవా" అని వారియార్ అడగ్గా అతను తొందరపడ్డాను కదా అనుకున్నాడు. అద్దం లేకుండా ముఖాన్ని చూడలేనన్నాడు. తన తొందరపాటుని గ్రహించి క్షమించండి అని నమస్కరించాడు..
"సోదరా! ఈ శరీరంలో వెనుక భాగం అస్సలు కనిపించదు. ముందు ఉన్న ముఖమూ కనిపించదు. నీ శరీరంలో కొంత వరకే చూడగలవు. కానీ నువ్వేం చెప్పావు....నా శరీరాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నానన్నావు. పైగా అసహనం కూడా. నువ్వు నీ మొత్తం శరీరాన్ని చూడాలనుకుంటే, నువ్వు. నిలువుటద్దాల మధ్య నిల్చుంటే శరీరం రెండు వైపులా చూడగలవు. మరి పరమాత్మను చూడాలంటే వొట్టి కళ్ళు సరిపోతాయా ఆలోచించు...భగవంతుడిని వీక్షించడానికి రెండు రకాల అద్దాలు అవసరం. అవి దుకాణంలో దొరకవు. వాటిలో ఒకటి దేవునిక కృప. మరొకటి గురువు కృప. ఈ రెండు కృపలతోనే పరమాత్మను చూడవచ్చు. దైవీక కృప ప్రతి చోటా ఉన్నప్పటికీ, దానిని గురువు కృప నుంచీ పొందాలి. కనుక ఈ రెండు కృపలూ తప్పనిసరి" అని అన్నారు కృపానంద వారియార్.
అంతట అతను తన తప్పు గ్రహించి
క్షమించమని ఆయన పాదాలపై పడ్డాడు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి