సెలవుల్లో: సరికొండ శ్రీనివాసరాజు
 వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలంతా అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు. మేనమామ రాజు ఈ వేసవి సెలవులు ఎలా గడపాలో పథకం వేశాడు. పిల్లలందరికీ ఇష్టమైన ఆట షటిల్. మేనమామ పిల్లలతో ఇలా అన్నాడు. "పిల్లలూ! ఈ సెలవులను బాగా ఆటపాటలతో గడపాలి. కరవు తీరా ఆడాలి. టీవీలు, మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నిబంధనలను అతిక్రమిస్తే వారిని మిగతా వారు ఆటలలోంచి బహిష్కరించాలి. వారిని ఎవరూ పట్టించుకోవద్దు." అని. 
     అందరూ కలసి షటిల్ ఆటలో పోటీలు పెట్టుకుందాం. అనుకున్నారు. మొత్తం 12 మంది ఒక్కొక్కరూ ప్రతి ఒక్కరితో పోటీ పడాలి. ఆ తర్వాత టాప్ 4 వచ్చిన వారికి సెమీ ఫైనల్. ఆ తర్వాత ఫైనల్. ఫస్ట్ & అండ్ సెకండ్ వచ్చిన వారికి ఊహించని గొప్ప బహుమతులు.
      పోటీలు మొదలైనాయి. పట్టుదలతో చివరి దాకా గెలవాలని ఆడుతున్నారు పిల్లలు. సెలవులు ఆటపాటలతో గడిచిపోతున్నాయి. రోజులు మంచులా కరిగిపోతున్నాయి. షటిల్ పోటీలు సెమీ ఫైనల్స్ మిగిలాయి. మొదటి సెమీ ఫైనల్ మొదలైంది. ఆటలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు మహేంద్ర, తిరుమలేశ. చివరికి వచ్చేసరికి తిరుమలేశుదే పైచేయి అవుతుంది. తన అన్నయ్యే గెలువబోతున్నాడని ఆసక్తిగా ఆట చూస్తున్నది శ్రుతి. చివరలో హఠాత్తుగా ఆట ఆపేశాడు తిరుమలేశు. టీవీలో తన అభిమాన జట్టు ఆడుతుంది. ఆ మ్యాచ్ మిస్ అవుతానని, మిగిలిన ఆట రేపు ఆడుకుందాం అని ఆగమేఘాల మీద అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తిరుమలేశు. 
     "ఇప్పుడు ఇండియా ఆడే ఆటలే లేవు కదా! అయినా తన ఆట కంటే టీవీలో ఆటలే ముఖ్యమా?" అన్నది వాగ్దేవి. శ్రుతి తల పట్టుకుంది. అప్పటిదాకా తిరుమలేశుతో పోటీ పడిన మహేంద్రను విజేతగా ప్రకటించారు. మహేంద్ర ఫైనల్ చేరినట్లు ప్రకటించారు. మరునాడు ఉదయం పది గంటల సమయంలలో తిరుమలేశు "నిన్న ఆగిపోయిన ఆటను ఇప్పుడు కొనసాగిద్దాం రండి. విజయం నా చేతులలోకి వస్తుంది. నా గెలుపును చూడండి." అన్నాడు. శ్రుతి కోపంగా జరిగిన విషయం చెప్పింది. "ఇది అన్యాయం." అన్నాడు తిరుమలేశు. "అన్యాయం ఏమీ కాదు. న్యాయమే. ఈ ఆటలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటి? మొబైల్ ఫోన్లు, టీవీల పిచ్చి నుంచి మనలను మరల్చడానికి. కానీ ఏమైంది? మళ్ళీ మొదటికే వచ్చింది. కాబట్టి న్యాయమే. నువ్వు ఘోరంగా ఓడిపోయినట్లే." అన్నది శ్రుతి. "వీళ్ళందరూ నన్ను కావాలనే పక్కన పెట్టినారు చెల్లీ! నేను గెలుస్తానని కుళ్ళు. మనం ఇంకా ఇక్కడే ఉండటం అనవసరం. అమ్మతో కలసి మన ఊరికి వెళ్దాం చెల్లీ!" అన్నాడు తిరుమలేశ. "నేను రాను. షటిల్ ఆటనే కాక ఇంకా ఆడే ఆటలు చాలా ఉన్నాయి. అన్నిటినీ కరవు తీరా ఆడి వస్తాను. నువ్వు వెళ్ళి టీవీలు చూస్తావో, సెల్ ఫోన్లతో ఆడుకుంటావో నీ ఇష్టం. నీకు పోటీ ఎవ్వరు రారు. డూ ఫెస్టివల్." అన్నది శ్రుతి. అందరూ పడీ పడీ నవ్వారు. తిరుమలేశు సిగ్గుతో తల దించుకున్నాడు. 

కామెంట్‌లు