కృతజ్ఞత : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రుతి 8వ తరగతి చదువుతున్నది. ఈసారి తన పుట్టినరోజును మిత్రులందరి మధ్య ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించింది. తండ్రి తిరుమలేశుని బతిమిలాడి అనుమతి పొందింది. శ్రుతి పుట్టిన రోజు రానే వచ్చింది. సాయంత్రం మిత్రులంతా వచ్చినారు. పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి.
      ఇంతలో ఒక కొత్త వ్యక్తి ఆ పుట్టిన రోజు వేడుకలలో ప్రత్యక్షం అయినాడు. శ్రుతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినాడు. అందరూ ఆశ్చర్యంగా, వింతగా చూస్తున్నారు. ఎవరు ఈ వ్యక్తి అని? ఆ వ్యక్తి శ్రుతి వాళ్ల నాయనమ్మతో "పెద్దమ్మా! నన్ను గుర్తు పట్టారా?" అని అడిగాడు? ఊహించని ఆ పిలుపుకు శ్రుతి వాళ్ల నాయనమ్మ ఆశ్చర్యపోయింది. "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది." అన్నది. "మిమ్మల్ని కాదు. నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే! అనాలి. నా పేరు రాము. చిన్నప్పుడు మీ ఇంటికి కథల పుస్తకాలు చదవడానికి క్రమం తప్పకుండా వచ్చేవాడిని." అన్నాడు రాము. "అవును. మా అబ్బాయి అల్లరి చిల్లర తిరుగుళ్ళు తిరుగుతుంటే నేను మా అబ్బాయిని మంచి దారిలో పెట్టడానికి నీతి కథల పుస్తకాలు తెప్పించాను. ఆ కథల విలువ బాగా తెలిసి, ఆ కథలను చదవడానికి నువ్వు మా ఇంటికి క్రమం తప్పకుండా మా ఇంటికి వచ్చేవాడివి. మా అమ్మాయి సిరి కూడా ఆ రోజుల్లో కథల పుస్తకాలను బాగా చదివేది." అన్నది శ్రుతి వాళ్ల నాయనమ్మ. "మా అమ్మాయి శర్వాణి మీ శ్రుతి క్లాస్ మేట్. మీ మనవరాలి పుట్టిన రోజు ఆహ్వానం గురించి చెప్పింది. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని నేనూ వచ్చాను. మీ ఇంటికి వచ్చి, నేను చదివిన అసంఖ్యాకమైన కథల పుణ్యమా అని కొత్త ఆలోచనలతో నేనూ బాలల కథా రచయిత అయ్యాను. విపరీతంగా కథలు రాసి, ఆ కథలతో పుస్తకాల ప్రింట్ తీయిస్తున్నాను. మీ మనవరాలికి పుట్టిన రోజు బహుమతిగా ఇవ్వాలని 50 పుస్తకాలను తెచ్చాను." అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. తిరుమలేశు రామును అక్కున చేర్చుకున్నాడు. "మా అమ్మ కథల విలువ నాకు తెలియాలని చేసిన ప్రయత్నం వల్ల నేను కాకున్నా మీరంతా బాగుపడ్డారు. చాలా సంతోషం. ఇక నుంచి మనంమంచి మిత్రులం. కాదు కాదు. అన్నా తమ్ముళ్ళం" అన్నాడు తిరుమలేశం. అందరూ సంతోషించారు. 

కామెంట్‌లు