ఉత్తరాన్ని తిరగరాయించిన గాంధీజీ:- - యామిజాల జగదీశ్
మహాత్మా గాంధీ పోరాటం ఆంగ్ల పాలకులతో కాదు, దేశంలో పాతుకుపోయిన మానసిక బానిసత్వంతో. 
మనిషి తన అంతర్గత బానిసత్వాన్ని వదిలిపెట్టే వరకు రాజకీయ స్వాతంత్ర్యం కూడా అసంపూర్ణంగానే ఉంటుందని గాంధీజీ నమ్మారు. ఈ మానసిక బానిసత్వానికి వ్యతిరేకంగా గాంధీ చేసిన పోరాటం చిన్న చిన్న, విషయాలలోనూ లోతైన సంకేతాలలో కనిపించేది. అలాంటి ఒక సందర్భం మహాదేవ్ దేశాయ్, బ్రిటిష్ అధికారి సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు మధ్య సంబంధిం చినది.
సిరిల్ రాడ్‌క్లిఫ్ అప్పట్లో ఒక ప్రసిద్ధ బ్రిటిష్ అధికారి. ఆరోజుల్లో ఆయన భారతదేశ వైస్రాయిగా కూడా రావచ్చుననే చర్చ కూడా ఉండేది. ఆయన ఒక ప్రసిద్ధ పుస్తకం రాశారు. దానిని మహాదేవ్ దేశాయ్ గుజరాతీలోకి అనువదించాలను కున్నారు. అనుమతి కోసం మహాదేవ్ దేశాయ్ ఆయనకు ఒక లేఖ రాశారు.
మహాశయులకు (His Excellency),
దయచేసి మీ పుస్తకాన్ని గుజరాతీలో ప్రచురించడానికి మీ దయగల అనుమతిని ఇవ్వండి. నేను దానిని ప్రచురించాలనుకుంటున్నాను. దయచేసి నాకు మీ అనుమతిని ఇవ్వండి.
మీ విధేయుడు Your's Faithfully
మహాదేవ్ హరిభాయ్ దేశాయ్
ఆయన ఇంకా ఇలా లాంఛనప్రాయంగా కూడా రాశారు —
"మహాశయులకు, Your Excellency
 మీ ఈ విలువైన, అద్భుతమైన పుస్తకాన్ని నేను ఇంగ్లీష్ నుండి గుజరాతీలోకి అనువదించాలనుకుంటున్నాను.  దానిని ముద్రించడానికి అనుమతించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను."
మహాదేవ్ తాను రాసిన ఈ ఉత్తరాన్ని గాంధీజీకి చూపించినప్పుడు, ఆయన వెంటనే, "ఇదిగో నీ ఉత్తరంలోని కొన్ని పదాలను మార్చు" అని సూచించారు.
'మహాశయులకు', 'మీ విధేయుడు' వంటి పదాలు మానసిక బానిసత్వానికి చిహ్నాలని గాంధీజీ మహాదేవ్ దేశాయ్‌తో చెప్పారు. గాంధీజీ ఆయనతో మరొక ఉత్తరాన్ని ఈ విధంగా రాయించారు —
శ్రీ సిరిల్ రాడ్‌క్లిఫ్,
నేను మీ పుస్తకాన్ని గుజరాతీలోకి అనువదించాను. నేను దానిని ప్రచురించాలనుకుంటున్నాను. నాకు మీ అనుమతిని ఇవ్వండి.
మీ ఆత్మీయుడు
మహాదేవ్ హరిభాయ్ దేశాయ్
గాంధీజీ వివరించారు - 
"ఏ భాషలో అయితే విశేషణాలు ఎక్కువగా ఉండి, అర్థం తక్కువగా ఉంటుందో, ఆ భాష స్వతంత్రుడిది కాదు. రచయితకు, అనువాదకుడికి మధ్య సంబంధం సమానంగా ఉంటుంది. అనువాదకుడు సేవకుడు కాదు. సృజనాత్మక వ్యక్తి. రచయిత స్వయంగా చేయలేని పనిని అనువాదకుడు చేస్తాడు. అతను ఆ ఆలోచనను మరొక భాషలో, మరొక సంస్కృతిలో సజీవంగా ఉంచుతాడు."
భారతదేశంలో బానిసత్వం అధికారం కంటే భాష, సంబోధన, ప్రవర్తనలో ఎక్కువగా దాగి ఉందని ఆ క్షణంలో తాను గ్రహించానని మహాదేవ్ దేశాయ్ తరువాత రాశారు. అందుకే గాంధీజీ రొట్టె, బట్ట, గూడుతో పాటు ఆత్మగౌరవం అనే నాల్గవ తప్పనిసరి అంశాన్ని జోడించారు. వారికి ఆత్మగౌరవం అనేది ఒక భావోద్వేగ పదం కాదు, స్వతంత్ర జీవితానికి అది ఒక ప్రాథమిక షరతు అని అభిప్రాయపడ్డారు. ఈ సూచన మనస్తత్వాన్ని స్వేచ్ఛగా, ఆలోచనాత్మకంగా మార్చే ప్రక్రియ. మాటలు నిటారుగా సూటిగా ఉండాలంటారు.
గాంధీజీకి గతం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా అవసరం.
ఈ సంఘటనను గాంధీ పీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు కుమార్ ప్రశాంత్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

కామెంట్‌లు