నింద:- సి.హెచ్.ప్రతాప్
 దక్షిణ దేశంలోని పచ్చని పల్లెటూళ్ల మధ్య, కొండ శిఖరంపై కృష్ణానంద స్వామి అనే గొప్ప జ్ఞాని ఆశ్రమం ఉండేది. కృష్ణానంద స్వామి శివభక్తులు, నిరంతరం ఆత్మజ్ఞాన బోధలో మునిగేవారు. ఆయనకు శిష్యులు, భక్తులు వేల సంఖ్యలో ఉండేవారు. ఆ ప్రాంతంలో ఆయనను పరమశివుని ప్రతిరూపంగా కొలిచేవారు.
అదే గ్రామానికి చెందిన నిర్మల అనే యువతి, తన మనసు కోల్పోయి, నడవడిక తప్పింది. తను గర్భవతి అయినప్పుడు, గ్రామంలో పెద్దలు తండ్రి ఎవరో నిలదీశారు. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు, ఆ అమ్మాయి అకస్మాత్తుగా 'ఈ బిడ్డకు తండ్రి కృష్ణానంద స్వామే!' అని అబద్ధం చెప్పింది.
ఆ మాట విని గ్రామంలో పెద్ద పెను తుఫాను రేగింది. పవిత్రమైన స్వామిపై ఇంతటి నింద మోపడంతో భక్తులు, శిష్యులు తీవ్ర ఆందోళన చెందారు. గ్రామ పెద్దలు కోపంతో, అవమానంతో ఆశ్రమానికి వెళ్లి, కృష్ణానంద స్వామిని నిలదీశారు.
"స్వామీ! ఈ అబద్ధపు ఆరోపణ గురించి మీరేమంటారు? మీ పవిత్రతకు మాయని మచ్చ తెచ్చారు!" అని అడిగారు.
కృష్ణానంద స్వామి కళ్ళు మూసుకొని, సమాధి స్థితి నుండి కళ్ళు తెరిచారు. ఆయన ముఖంలో కోపం లేదు, విచారం లేదు, చిరునవ్వు కూడా లేదు. ఒక ప్రశాంతమైన నిశ్చలత మాత్రమే ఉంది. ఆయన చాలా నెమ్మదిగా, కేవలం రెండు మాటలలో ఇలా సమాధానం ఇచ్చారు: "అవునా?"
ఆ తర్వాత, ఆ బిడ్డ పుట్టినప్పుడు, గ్రామ పెద్దలు ఆ పసికందును స్వామి ఆశ్రమంలో పడేసి వెళ్లిపోయారు. ఆ నిందను శిరసా వహించిన స్వామి, బిడ్డకు పాలు, పండ్లు, బట్టలు సమకూర్చడానికి భిక్షాటనకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ బిడ్డను ఎంతో వాత్సల్యంతో, తన కర్మగా భావించి, పసికందును పెంచడం మొదలుపెట్టారు. శిష్యులు ఆశ్చర్యపోయినా, స్వామి నిశ్చలత్వంలో ఉన్నతమైన తత్వాన్ని చూసి మౌనం వహించారు.
సుమారు ఒక సంవత్సరం గడిచింది. నిర్మల, స్వామి తన నిందను మౌనంగా భరించడం చూసి, లోలోపల పశ్చాత్తాపంతో దహించుకుపోయింది. చివరికి ఆమె గ్రామానికి వచ్చి, అందరి ముందు తన తప్పును, అసలు నిజాన్ని ఒప్పుకుంది. ఆ పసికందు తండ్రి మరొక యువకుడని ప్రకటించింది.
గ్రామ ప్రజలు, పెద్దలు, శిష్యులు ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకున్నారు. పరుగు పరుగున ఆశ్రమానికి వెళ్లి, స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. "స్వామీ! మేము మిమ్మల్ని అనుమానించాం. మీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేదు!" అని మొరపెట్టుకున్నారు.
కృష్ణానంద స్వామి తన చేతుల్లో ఉన్న బిడ్డను గ్రామ పెద్దలకు తిరిగి ఇస్తూ, అప్పుడు కూడా ప్రశాంతంగా, కేవలం ఒకే మాటలో ఇలా అన్నారు: "అవునా?"
నిజమైన జ్ఞానికి బాహ్య ప్రపంచంలోని నిందలు, పొగడ్తలు రెండూ సమానమే. ఏ అబద్ధపు తీర్పు మనల్ని కర్మ మార్గం నుండి పక్కకు తప్పించలేదు. ధర్మం వైపు మనం  నిశ్చలంగా ఉంటే, సత్యం మనకు  అండగా నిలబడుతుంది. 

కామెంట్‌లు