కథల విలువ : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రుతి 7వ తరగతి చదువుతున్నది. శ్రుతి చిన్నప్పటి నుంచీ తన స్నేహితురాలు లయ ఇంటికి వెళ్లి ఆడుకుంటుంది. లయ వాళ్ల అమ్మ గీతాంజలి తీరిక సమయాల్లో లయకు చాలా కథలు చెబుతుంది. శ్రుతి లయతో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు గీతాంజలి శ్రుతిలయలను ఇద్దరినీ కూర్చోబెట్టుకుని అనేక కథలు చెబుతుంది. లయ ఇంట్లో నీతి కథల పుస్తకాలు చాలా ఉన్నాయి. తీరిక సమయంలో లయ కథలను బాగా చదుపుతుంది. లయ పుణ్యమా అని శ్రుతికి కూడా కథలను బాగా చదవడం అలవాటు అయింది. 
      కొన్నాళ్ల తర్వాత శ్రుతి తన అమ్మను బతిమాలి కథల పుస్తకాలను కొని చదవడం అలవాటు చేసుకుంది. రాను రాను శ్రుతి కథల పుస్తకాల పురుగు అయింది. తీరిక సమయాలలో తన నాన్న తిరుమలేశాన్ని కూర్చోబెట్టుకుని బలవంతంగా కథలు వినిపిస్తుంది. చిన్నతనంలో తన చెల్లెలు సిరికి కథలు చదివే అలవాటు బాగా ఉండేది. అప్పుడు తన చెల్లెలు తనకు కథలు వినిపించాలని ఎంత ప్రయత్నం చేసినా తాను వినిపించుకోక పోయేది. తనతో కథలు చదివించాలని ఎన్ని కథల పుస్తకాలు తెప్పించినా తాని వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూతురు పుణ్యమా అని కథలను వినాల్సి వస్తుంది. కథల విలువ ఈ వయసులో తెలిసి వస్తుంది. 

కామెంట్‌లు