తెలుగు సాహితీవనం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ప్రథమ విజేత
===================================================================
//పల్లవి//
ఏడవకు ఏడవకు నా బంగారు కొండా
నల్ల కలువ కళ్లు నీలాలు కారేను
మెత్తని బుగ్గల్లు మందార మయ్యేను
కందిన మోమున జాబిల్లి పూచేను
//చరణం-1//
అమ్మలక్కలు నీకు జోలల్లు పాడేరు
నిద్దురోరా నా వెన్నెల సోనా
అమ్మమ్మ నానమ్మ ఊయల్లు ఊపేరు
ఊకొట్టరా నా జాబిలి కూనా
తాతయ్యలే నీకు తాయిలం తెచ్చేరు
ఏడవకు ఏడవకూ నా బంగారు కొండా
మారాము చేయకూ నా గారాల కన్నా
//చరణం- 2//
మీ నాన్నగారు ఆటబొమ్మలే తెస్తారు
నీ మేనమామ చక్కన్ని పిల్లనే ఇస్తాడు
నీ మేనత్త ముద్దు మాటలే నేర్పేనూ
ఏడవకు ఏడవకూ నా కన్నా తండ్రీ
ఏడిస్తే నీ కనుల నీలాలు కారు
నీలాల మేఘాల నే చూడలేను
//చరణం- 3//
పార్వతి దేవియే లాల పోస్తుంది
సాంబ్రాణి వేసి దిష్టి తీస్తుంది
వీణాపాణి యే ఉగ్గు పోస్తుంది
వాతాపి జీర్ణమని దీవెనలు ఇస్తుంది
కమలవాసినే నీకు జోల పాడేనూ
రామకథలెన్నో చెప్పి నీ ఊయలూపేనూ
ఏడవకు ఏడవకు నా బంగారు తండ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి