ఆకలి!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చీకటి చీకటిని బ్లాక్ మెయిల్ చేస్తుంటే 
కాంతి వాంతి చేసుకుంటుంది 
ప్రతిదినం తద్దినం పెడితే కాకులు కొన్నీరాకపోకలు మానుకున్నట్లు. 
ఆకాశం మైదానమై నక్షత్రాల ఆటలు ప్రదర్శిస్తుంది. 
వెక్కిరింపు కుక్కలు కొన్ని మొరిగీ మొరిగీ మౌనంగా నిష్క్రమిస్తున్నాయి. 


ఆవేశం రావాలంటే పౌరుషం కాదు ఆదర్శం కావాలి 
విసిరేసిన నీళ్లు పారవు మొలకెత్తుతాయి. 
నిశ్శబ్దపు యుద్ధంలో రక్తం పారదు- మాటలు నేలరాలవు-
శరీరాలు- ఆయుధాలు ఉండవు.
ఆత్మే లేనప్పుడు హత్య ఎలా చేస్తావు. 
పొద్దుపొడిస్తేనే కదా నిద్రలేచేది .కళ్ళే లేనప్పుడు ఎదురుచూపులు ఎందుకు. 
ఎదురుపడ్డ గోడలను మార్చాలని లేదు. మర్చిపోతే సరిపోతుంది. 

నేలను కూల్చిన అడుగులకు కూడా నీడలు ఉంటాయి 
ప్రతి కలుపు మొక్క  మొక్కే నని తెలుసు. కలుపుకుపోవాల్సిందే. 
తడబడ్డ దారి గమ్యం వైపు చూపు నిలుపుతుంది. 
అలసిపోయిన చినుకు ఆవిరి అయిపోతుంది 
మొలిచి తీరాలనుకున్న విత్తనాన్ని దాచిపెట్టకూడదు పాతిపెట్టాలి. 
కాళ్లు విరగగొట్టిన కళ్ళు నడుస్తాయి 
అస్తిపంజరాలు తమ మాంసాన్ని తామే తినేశాయి 
మనిషిని చంపాలంటే ఆకలిని చంపాలి. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు