ఒక ఊరిలో ఒక ధనవంతుడు వుండేవాడు. అతని దగ్గర రామరాజు అనే పనివాడు వుండేవాడు. అతను చాల నమ్మకమైనవాడు. తెలివైనవాడు. అంతే గాక గొప్ప వీరుడు గూడా. మంచి ఎత్తుతో వ్యాయామం చేసిన ఒంటితో కండలుదీరి వుండేవాడు.
ఒకసారి ఆ ధనవంతుడు ఎంతో విలువైన బంగారు నగలు రామరాజుకి ఇచ్చి “వీటిని జాగ్రత్తగా తీసుకొని పోయి పక్క ఊరిలో వున్న తన స్నేహితుడు సురేష్ కి ఇచ్చి రమ్మన్నాడు.
రామరాజు సరే అని ఆ నగలు తీసుకొని బైలుదేరాడు. అలా పోతావుంటే ఒక గజదొంగ రామరాజు చేతిలో నగలమూట వుందని గ్రహించాడు. వెంటనే ఒక తుపాకీ తీసుకొని దారిలో ఎవరూ లేనిచోట అటకాయించాడు.
“మర్యాదగా నోరుమూసుకొని ఆ నగలు ఇవ్వు. లేకుంటే మరుక్షణంలో నా తుపాకీ గుండుకు బలవుతావు జాగ్రత్త" అని బెదిరించాడు.
రామరాజుకు ఎంత బలంవున్నా తుపాకీ ముందు అదేమీ పని చేయదు గదా. దాంతో మౌనంగా తన చేతిలోని మూటను దొంగకు అందించాడు.
చిన్న గొడవకూడా లేకుండా నగలు దక్కడంతో దొంగ సంబరపడిపోయాడు. అంతలో రామరాజు "అయ్యా... నేను ధనవంతున్ని కాదు. కేవలం అతని దగ్గర పనివాన్ని మాత్రమే. నగలు దొంగ ఎత్తుకుపోయాడు అంటే అతను అస్సలు నమ్మడు. నేను వాటిని దాచి పెట్టి అబద్ధం చెబుతున్నా అనుకుంటాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. చేయని తప్పుకు ఉద్యోగం పోవడంతో బాటు కారాగారంలో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. కాబట్టి నా అంగీని మీ తుపాకీతో కాల్చండి. ఆ రంద్రాలని చూసి నన్ను వదిలేస్తారు. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి” అంటూ దీనంగా వేడుకున్నాడు.
దొంగ 'సరే' అన్నాడు.
వెంటనే రామరాజు తన అంగీ విప్పి దాని గాలిలో ఎగురవేశాడు. దొంగ నవ్వుతా. "ఢాం... ఢాం... ఢాం...." అంటూ గాలిలోనే ఆ అంగీ కింద పడకముందే తుపాకీతో కాల్చాడు. దానికి వరుసగా మూడు రంద్రాలు పడ్డాయి.
అది చూసి రామరాజు ఆశ్చర్యపోయి సంబరంగా చప్పట్లు కొడతా “అబ్బ... తుపాకీ పేల్చడంలో నీ అంత మొనగాడు. ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా వుండడు. ఎంతోమంది మొనగాళ్ళని చూసినా గానీ నీలా గాలిలో ఎగరేసిన వస్తువును కింద పడకముందే అంత వేగంగా కాల్చేటోన్ని నేనేప్పుడూ చూడలేదు. కానీ... అంగీ కొంచెం పెద్దగా వుంటుంది గదా, దానికంటే చిన్నదయిన నా టోపీని గాలిలో ఎగరేస్తే దానిని గూడా అంతే వేగంగా గురిచూసి కాల్చగలవా” అన్నాడు.
“ఓస్... అదెంత పని. ఎగరేయ్ చూపిస్తా నా తడాఖా" అన్నాడు దొంగ మీసాలు తిప్పుతూ. రామరాజు టోపీని తీసి వేగంగా గాలిలో పైకి ఎగరవేశాడు.
దొంగ దానిని గూడా గురిచూసి గాలిలోనే “ఢాం... ఢాం... ఢాం...” అంటూ కాల్చి పారేశాడు. విజయగర్వంతో రామరాజుకేసి తిరిగి "ఎలా వుంది నా గురి" అంటూ కనుబొమ్మలు ఎగురవేశాడు.
రామరాజు చిరునవ్వుతో "గురి బాగానే వుంది గానీ... నీ బుర్రలో గుజ్జే కొంచెం గూడా లేదు" అన్నాడు.
దొంగకు ఆ మాటలు విని విపరితమయిన కోపం వచ్చింది. "ఏందిరా... ఎక్కువ తక్కువ మాట్లాడ్తా వున్నావు. ఇక్కడికిక్కడే కాల్చి పారేస్తా చూడు" అంటే తుపాకీ రామరాజు పై గురి పెట్టాడు.
రామరాజు నవ్వుతా “ఒరే సన్నాసి... తుపాకీలో వుండేది ఆరు గుళ్ళే. మూడు అంగీ కాల్చడానికి, మూడు టోపీ కాల్చడానికి అయిపోయాయి. ఇప్పుడిందులో ఒక్క బుల్లెట్టు లేదు. గుళ్ళులేని తుపాకి ప్రాణంలేని శవంతో సమానం” అంటూ వాని మొహం మీద బలమంతా ఉపయోగించి ఒక్కటి కొట్టాడు. దెబ్బకు వాని మూతి పగిలి కళ్ళు బైర్లు కమ్మాయి. ఏడేడు పద్నాలుగు లోకాలు గిర్రున కళ్ళముందు తిరిగాయి.
రామరాజు దొంగ చేతిలోని తుపాకీ గుంజుకొని వాని అంగీ పట్టుకొని “రేయ్... నా దగ్గర కొట్టేసిన నగలతో బాటు నీ మెడలోని గొలుసు, చేతి వాచి గూడా మారు మాట్లాడకుండా తీసి ఇస్తావా లేక చుక్కలు కనబడేలా మరో గుద్దు గుద్దమంటావా" అన్నాడు పిడికిలి బిగించి.
అప్పటికే వాని చేతిదెబ్బ రుచి చూసిన దొంగ భయంతో వణికిపోయాడు. నగల మూటతోబాటు గొలుసూ వాచీ కూడా వాని చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి