ఒక స్వచ్ఛంద సంస్థ వారు పాఠశాలకు వచ్చినారు. విద్యార్థులకు క్విజ్ పోటీ మరో వారం రోజుల్లో నిర్వహిస్తామని, గెలుపొందిన జట్టుకు మంచి విలువైన బహుమతులను అందజేస్తామని ప్రకటించారు. సాయంత్రం సమయంలో 8వ, 9వ, 10వ తరగతి మూడు తరగతుల విద్యార్థులను సమావేశపరచి, ఉపాధ్యాయులు ఎవరెవరు పాల్గొంటారో పేర్లు ఇవ్వమన్నారు. అది ఫిబ్రవరి నెల మొదటి వారం. ప్రీ ఫైనల్ పరీక్షలు సమీపిస్తుండటంతో తెలివైన విద్యార్థులు ఎవరూ ముందుకు రాలేదు. 8వ, 9వ తరగతి పిల్లలే ఎక్కువగా పేర్లు ఇస్తున్నారు.
10వ తరగతిలో అత్యుత్తమ విద్యార్థులు అయిన శ్రుతి, లయలు తాము పాల్గొనమని అన్నారు. ఇంకా కొంతమంది తెలివైన విద్యార్థులు ముందుకు రావడం లేదు. దీనితో 10వ తరగతి చదువుతున్న హారిక అనే అమ్మాయి తాను పాల్గొంటానని పేరు ఇచ్చింది. హారికకు తెలివితేటలు ఉన్నా నిర్లక్ష్యంతో చదువులో వెనుకబడి ఉంది. చదువు మీద ఉంచాల్సిన ధ్యాస అల్లరిలో ఉంచుతుంది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లు మిగతా విద్యార్థులను కూడా చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది.
హారిక 10వ తరగతి చదువుతున్న మరో తెలివైన అమ్మాయి అపర్ణను బతిమాలింది. "ప్లీజ్! నువ్వు తెలివైన అమ్మాయివి కదా! ఈ క్విజ్ పోటీలో పాల్గొనవే." అని. "ప్రీ ఫైనల్స్, పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ పోటీలు అవసరమా? నేను పాల్గొననను. చదువుకోవాలి." అన్నది అపర్ణ. "నేను మన టీం కెప్టెనుగా ఉంటా. ఓడిపోతే కెప్టెనుకే చెడ్డ పేరు కదా! నిన్ను ఎవరూ ఏమీ అనరు కదా!" అన్నది హారిక. "నాది ఒక కండీషన్. టీం లీడరుగా ఉండటమే కాదు. అందరి కంటే ఎక్కువగా నాయకులే జవాబులు చెప్పాలి. నిన్ను చూస్తే ఆ నమ్మకం లేదు." అన్నది అపర్ణ. "నన్ను నమ్ము. ఈ వారం రోజులూ బాగా కష్టపడి చదువుతాను. ఇంటివద్ద కూడా రాత్రి 10 దాకా, ఉదయం 4 గంటలకే లేచి చదువుతా." అన్నది హారిక.
హారిక అల్లరి మానలేదు. రోజూ లాగానే ప్రవర్తిస్తుంది. పాఠశాలలో అస్సలు చదవడం లేదు. సమయం బాగా వృథా చేస్తున్నది. ఆదివారం నాడు హారిక ఇంటికి వెళ్లింది అపర్ణ. హారిక ఇంట్లో టీవీ చూస్తుంది. అపర్ణ మళ్ళీ ఇంటికి వెళ్లింది. క్విజ్ పోటీ రోజు రానే వచ్చింది. అనూహ్యంగా అపర్ణ ఆ రోజు పాఠశాలకు రాలేదు. అపర్ణ బదులుగా ఆ టీంలో మరొకరిని తీసుకోవాల్సి వచ్చింది. క్విజ్ పోటీలో హారిక టీం చిత్తుగా ఓడిపోయింది. ఆఖరి స్థానం వచ్చింది. ఆ తర్వాత హారిక అపర్ణను "నిన్ను నమ్ముకున్నందుకు నాకు శాస్తి జరిగింది." అన్నది. "నాకు ఏమి మాట ఇచ్చావు? ఈ వారం రోజులు కష్టపడి చదువుతా అని. కానీ బడిలో, ఇంట్లో బాగా ఎంజాయ్ చేశావు. అదృష్టం మీద ఆధారపడి బహుమతులు కొట్టేయాలని చూడకు. స్పయంకృషిని నమ్ముకో." అన్నది అపర్ణ. అందరూ నవ్వారు. హారిక అవమానంతో అక్కడ నుండి వెళ్లిపోయింది.
తగిన శాస్తి: -సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి