మా ప్రేమను నీవు తట్టుకోలేవు.
యజ్ఞంలో నెయ్యి మంటల్లా
శీతాకాలంలో చలిమంటల్లా
నీటిలో నిండా మునిగి ఊపిరి బిగబట్టి
ఉక్కిరి బిక్కిరి అయినట్లు
గోరుముద్దలు తింటూ గొంతు తడబడ్డట్లు
తలంటు స్నానం చేస్తుంటే
ఒళ్లంతా జల్లుమన్నట్లు
పరిగెత్తి పరిగెత్తి నిలబడితే కళ్ళు తిరిగినట్లు
పొట్ట పగిలేలా నవ్వి నవ్వి ఆనందభాష్పాలు రాల్చినట్లు
చెట్టుకు కట్టిన ఊయల్లో
ఊగి ఊగి ఆకాశంలో చక్కర్లు కొట్టినట్టు
పచ్చని పైరుల వెంట తిరిగి తిరిగి పైరగాలిలా వీచినట్లు
పొంగిపొర్లీ పరుగులు తీసి వాగు వంపులు తిరిగినట్లు
పొదుగులోని పాలను నోటితో పిండి తాగినట్లు
మొద్దు నిద్దుర పోయి
రాత్రి పగలు తేడా తెలియనట్లు
కడుపునిండా ప్రసాదం తిని కంటినిండా కలలు కన్నట్లు
ఊరంతా తిరిగి తిరిగి పేరు మర్చిపోయినట్లు
అమ్మ ఒడిలో ముల్లోకాలు దర్శించుకున్నట్లు
తెల్లవారుజామున కమ్మేసిన పొగ మంచులా
మా ప్రేమను నీవు తట్టుకోలేవు.!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి