అక్కెరెల్ల దీస్కొని తక్కెడ పొయ్యిల బెట్టినట్లు
******
"గిట్లనే ఉంటదా శెప్పవ్వా! గాల్ల నడ్మ పచ్చిగడ్డేస్తే బగ్గు మనేటోళ్ళని ఒక్కటి జేసిన.ఇర్గు పొర్గు అన్నంక ఎన్నో అవస్రాలు,అక్కెర్లు ఉంటయి, మంచి శెడులు ఉంటై.గట్ల ఎడమొగం పెడమొగం పెట్కోని ఉంటే బాగుండదు కల్సిపోవాలె అని ఇద్దర్ని కూసుండబెట్టి తీర్మానం జేసిన".
"మొన్నటికి మొన్న పొలానికి మందెయ్యడాన్కి మందులు కొందామంటె శేతిల ఒక్క పైస లేదు" ఎట్లని తండ్లాడుతుంటే అప్పటికప్పుడు ఎన్నాళ్ళ నుండో మా ఇంటి దానికి శెంద్రారం చేయించాలని,గుర్గిల కూడబెట్టిన పైసలు దీశి శేతుల బెట్టిన.
గయ్యాల శేని కానించొత్తు శక్కరొచ్చి పడిపోతే "దవాఖానాకు తోల్కపోవడాన్కి ఏమైనా సర్థుతవా అన్నా!" గుడ్లనీళ్ళు గుక్కుకొని అడ్గితే కాదన్లేక, మా ఇంటిది పాలు పెరుగు అమ్మి పోపుల డబ్బల దాస్కున్న డబ్బుల్ని,గదుమ బట్కొని అడక్కొచ్చి మరీ ఇచ్చిన".
"గింతకీ ఏంది తమ్మీ! గింత,గంత సాయం జేస్నవ్,గదంత బాగనే ఉంది.ఎందుకిట్ల గవన్ని యాజ్జేస్కుంటున్నవ్? ఏమైంది?గంత గనం రంది జేత్తున్నవ్? అనంగనే..."
కొమురయ్య గివే కాదవ్వా! ఇంగెన్ని మార్లో మూడో కంటికి దెల్వకుండ సాయం జేసిన.గవన్ని యాదిమర్షిండవ్వా?
అయ్యో! గట్లనా తమ్మీ? గాడేంది? గట్ల జేసిండా? గంతే ఉంటది "అక్కరెల్ల దీస్కోని తక్కెడ పొయ్యిన బెట్టినట్లు"
అనంగనే అక్కడే కూసోని సద్వుకుంటున్న బుడ్డోడు, భూలచ్మి వొచ్చి "అవ్వా! అవ్వా! గీ నడ్మ కతలు జెప్పక శానొద్దులైంది. గిప్పుడు నువ్వన్నవ్ జూడు " "అక్కర దీస్కోని తక్కెడ పొయ్యిల బెట్టినట్లు" గా కతేందో జెప్పు"అవ్వా! అని ఒక్క తీర్గ బతిలాడ బట్టిండ్రు.
సరేననీ అవ్వ మొదలు బెట్టింది "అనగన్గా ఒకూల్లె ఒక ఒల్లొంగని ఆయన ఉండేటోడు. ఇంట్లె గాయన్ని "తిండి దండగోడా !కూసోని తింటే గుట్లైన కర్గుతయి. మనమేవన్న సంపన్న సావుకార్లమా! నా ఒక్కతి రెక్కల కట్టం మీద ఇల్లెడు సంసారం బత్కుతున్నది. ఏవన్న పన్జేయకుంటే ఇంగ రేపట్నుంచి బువ్వ గివ్వ ఏం పెట్టను. ఏంజేస్కుంటవో పో!" అని లాషిగ అర్శి లొల్లి జేసింది.
" గా సోమరోడికేమో తిండి యావ ఎక్కువ. ఇంగెట్ల! తిండి తినాలంటే పెళ్ళాం శెప్పినట్టు యినాల్సిందే" అన్కుంట పొద్దుగాల సుక్క బొడ్వకముందే లేశిండు. శిన్నగ ఇల్లొదిలి అడ్వి బాట బట్టిండు. అడ్వి శేరే సైమానికి ఇంక తెల్లార్లె. కాళ్ళు నొచ్చి శెద్దరు గప్పుకొని ఓ శెట్టు కాడ కూసుండు.
"గప్పుడే ఓ ఇద్దరు దొంగలు రాత్రి దొంగతనం జేసిన బంగారు సొమ్ములను శెట్టు తానకి వొచ్చి పంచుకోవడాన్కి మూటిప్పి కూసున్నరు. దొంగల్ని జూసిన సోమరోడు బయంతో వొన్కడం మొదలు బెట్టిండు. గదేందబ్బా! అసలే నల్ల శెద్దరు,మనిషి అగపడ్డం లేదు.దెయ్యం గావచ్చు కదుల్తుంది "అన్కొని బయంతో గా మూటక్కడే వొదిలేసి ఉరుకురికి పారిపోయిండ్రు.గాళ్ళు బోయింది జూసి గా మూట బట్కొని ఇంటికొచ్చిండు.
ఇంగ గా సోమరోని పెళ్ళాం సంబురం అంతింత గాదు.గా బంగార సొమ్ములు బర్వు ఎంతున్నయో కొల్వడాన్కి పక్కింటి సేటు తానికి బొయ్యి తక్కెడ అడుక్కొచ్చింది. జోకింది. గా మూటని ఇంట్లె దాశిపెట్టింది.
ఇంగ గా సేటు ఇచ్చిన తక్కెడ ఇద్దామని దాన్ని అటిటు సూత్తుంటె అడ్గున శింత పండు అత్కిచ్చి ఉండటం సూశింది.సేటు ఏంజేసిండంటే ఎన్నల్లేంది తక్కెడ అడిగిండ్రు. గీళ్ళు ఏం కొలుత్తరో తెల్సుకుందామని గింత శింత పండు తక్కెడ అడ్గున అతికిండ్రు.
"అమ్మనీ! ఇంత పన్కొచ్చినవా !అన్కొని గా తక్కెడని తీసికెళ్ళి పొయ్యిల బెట్టింది.
అక్కెరెల్ల దీస్కున్నంక ఆళ్ళ తక్కెడ ఆళ్ళకి ఇయ్యాలె గద! ఇయ్యలే!గందుకనే అప్పట్నుంచి గీ సామెత బుట్టింది" అని జెప్పింది.
"భూలచ్మి బుడ్డోడు గా సేటుది తప్పే,సోమరాయన ఇంటామెది సుత తప్పే కదవ్వా! అంటుంటే మా బంగారు కొండలకి ఎంత తెల్వో అని అవ్వ మురిసి పోయింది.
గదండీ సంగతి. "అక్కెరెల్ల దీస్కోని తక్కెడ పొయ్యిల బెట్టినట్లు" అంటే గిదే మరి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి