సుప్రభాత కవిత : - బృంద
నిద్రించు పసిపాప పెదవులపై 
విరబూసే ముద్దయిన నవ్వులా
గాలికి ఊగే రెల్లుపువ్వుల
చిందర వందర నాట్యవిన్యాసం
హాయిగొలుపు మేలుకొలుపు!

పండు ముసలి ముత్తయిదువ
నొసట వెలుగు కుంకుమలా..
చూచినంతనే  మనసునిండు
పసుపు పచ్చని పైరు సొగసు
శ్రీలు కురిసే సిరినవ్వుల కొలువు

కలుపుకున్న బంధాలతో
కరుగుతున్న కాలం తీరున
కనిపెట్టుకునే తల్లిప్రేమలా
కదిలి వచ్చు కాలువ ఇచ్చే
కన్నపిల్లల కడుపునింపే చలువ..

రేయంతా అప్రమత్తతతో మెలగి 
పృథ్వి ని  కంటికి రెప్పలా కాచి 
తొలిసంధ్యను ఆహ్లాదంగా  చూచి
కనక కాంతులు ఆవరించిన
గిరి శిఖరాల ఆనంద వైభవము..

ఎన్నో సొగసులు 
చిత్ర వర్ణ కాంతులతో 
పొందికగా పొదుగుకుని
కుదురుగా వధువులా తోచే
మధుర మేదినికి

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు