భలే అమ్మాయి : సరికొండ శ్రీనివాసరాజు
 సెలవు రోజున పట్టణంలో విశేషాలను చూస్తుంది మధుగీతిక. ఒక షాపులో పంజరాలలో బంధించిన అందమైన పక్షులను అమ్ముతున్నారు. మధుగీతిక తల్లిదండ్రులను బతిమాలి అందమైన ఒక పక్షి ఉన్న పంజరాన్ని కొంటుంది. ఆ రోజు మొదలుకొని తరచూ ఆ దుకాణానికి వెళ్ళడం మధుగీతికకు మామూలు అయింది. ఆ పంజరాలలో బంధించిన షాపు యజమానిని పరరిచయం చేసుకుంది. అతని పేరూ మధు. అతనితో మంచిగా మాట్లాడటం, అప్పుడప్పుడు ఆ పంజరాల పక్షులను కొనుక్కొని తీసుకు వెళ్ళడం మధుగీతికకు మామూలు అయింది. దానితో ఆ షాపు యజమాని మధుగీతికను చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు.
      రాను రాను మధుగీతిక తన స్నేహితులతో కలసి ఆ షాపుకు రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఆ స్నేహితులు కూడా పక్షులతో కూడిన పంజరాలను కొంటున్నారు. షాపు యజమానికి అందరి మీద ఆప్యాయత, నమ్మకం కలిగింది. 
       ఒకరోజు మధుగీతిక పదిహేను మంది స్నేహితులతో అక్కడకు వచ్చింది. స్నేహితులు బాగా మాట్లాడుకుంటూ పంజరాలలో ఉన్న పక్షులను చూస్తూ సమయం గడుపుతున్నారు. చాలాసేపు ఆ షాపులోనే ఉన్నారు. "ఇంటికి వెళ్లరా తల్లులూ? మీ ఇంట్లో వారు మీ కోసం కంగారు పడరా?" అన్నాడు షాపు యజమాని. "రేపూ ఎల్లుండి రెండు రోజులూ మాకు సెలవులే అంకుల్. ఇంకా రెండు గంటలు ఇక్కడ ఉన్నా కంగారు పడరు." అన్నది మధుగీతిక. "అయితే ఇప్పుడే బయటికి పని మీద వెళ్ళి వస్తా. నేను తిరిగి వచ్చేసరికి ఇరవై నిమిషాలు పడుతుంది. ఈ చిలకలను పలకరించుకుంటూ ఇక్కడే ఉండండి ప్లీజ్!" అన్నాడు షాపు యజమాని. అతడు అలా వెళ్లిన ఐదు నిమిషాల తరువాత స్నేహితులు అందరూ షాపులో ఉన్న పక్షులను పంజరాలతో సహా తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అడవిలాంటి ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆ పంజరాల తలుపులు తీసి ఆ పక్షులను విడుదల చేసినారు. పక్షులు స్వేచ్ఛగా వెళ్ళిపోయాయి. 
    షాపు యజమాని షాపుకు వచ్చి చూసుకుని లబోదిబోమన్నాడు. మధుగీతికకు పంజరాలలో పక్షులను బంధించడం ఇష్టం లేదు. తరచూ వాటిని కొని విడుదల చేస్తున్నది. పథకం ప్రకారం షాపు యజమానికి తమపై నమ్మకాన్ని పెంచి సమయం రాగానే పక్షులకు స్వేచ్ఛ కలిగించింది. 

కామెంట్‌లు