కల్మషంలేని వాడే నరుడోయ్
నరుడే ఇలలో నడిచే
నారయణుడోయ్...
అంటూ గురజాడను
గుర్తుచేసూ కుందాం..!
గుండెలనిండా
మానవత్వం నింపుకుందాం..!!
ధనం కాదు నరులకు గుణం మిన్నోయ్...
కీర్తి కనకా కాంక్షలు కరిగి పోవలెనోయ్..!
మంచితనం కొంచెమైనా మధురమేనోయ్
సాహసంతో ముందుకు సాగిపోవలెనోయ్
వెరవవద్దోయ్ వెనకకు మరలొద్దోయ్..!
వినయ విధేయతలు విద్యలందేనోయ్...
శత్రుత్వం వైరం వాణిజ్య మందేనోయ్...
వ్యర్థమైన కలహాలను తుంచవోయ్...
జీవిత పరమార్ధం తెలుసుకోవోయ్..!
కక్షలు కార్పన్యాల్ని కాల్చవోయ్...
కరుణను ప్రేమను కురిపించవోయ్...
దేశాభిమానినని కోతలు కోయకోయ్...
కోరి జనులకు ఐకమత్యం నేర్పవలెనోయ్!
మనుషులంటే మట్టి కాదోయ్..!
మనుషులంటే మానవత్వమోయ్..!!
ఇరుగు పొరుగు పచ్చగున్న
ఈర్ష్య అసూయా ద్వేషాలెందుకోయ్...
ఈశ్వరుడది మెచ్చడని ఎరగవోయ్...
పరులకింత ఐమేల్ తలపెట్టిన
మన బ్రతుకంతా పచ్చదనమేనోయ్..!
కులంపేర కుమ్ములాటలేలనోయ్...
మతంపేర మారణహోమాలేలనోయ్...
ఒకే కులం ఓకే మతం ఓకే జాతియను
మధుర భావనల్
మన మదిలో మొలకెత్తాలోయ్...
మతసామరస్యమే మన నినాదమోయ్...
భిన్నత్వంలో ఏకత్వమే మనమతమోయ్!
కులమత బేధాలు ఏల మనకంటూ
కొమ్మల్లో కోయిలమ్మ కాకెమ్మతో కలిసి
స్నేహ గీతాలు ఆలపించాలోయ్...
విన్న జనులెల్లరు విభేదాలు
మరచి విశ్వనరులయ్యేరోయ్..!
మోమునందు
చిరుదరహాసాలు మొలకెత్తాలోయ్...
మనిషి మనిషి గుండెల్లో
సౌభ్రాతృత్వం పరిమళించాలోయ్..!
మానవత్వం...
మణిదీపమై ప్రకాశించాలోయ్...
ప్రేమతత్వం...
పంటకాలువై ప్రవహించాలోయ్..!
మనుషులంటే మట్టి కాదోయ్..!
మనుషులంటే మానవత్వమోయ్..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి