సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం.
 సామెత -76: -అడ్డిమార్ గుడ్డి దెబ్బ
    ****
"అవ్వా! అవ్వా! మన ఊల్లె సేటు కొట్లె  గుమాత్తాగ పంజేసే అప్పయ్య ఎరికె గద!"
"నాకెందుకు తెల్వదు శెల్లే! ఊల్లె అందరూ లాట్రీ టికెట్ల పిచ్చోడు అంటరు గదనే.గుమాత్తాగ వొచ్చే జీతమే అంతంత మాత్తరం.ఇంగ గందులో శారాణొంతు లాట్రీలకే తగలబెడ్తడని గాయ్న పెళ్ళాం ఎన్ని తేపల గోడెల్ల బోస్కుందో నాకు సుత ఎర్కేనే"
 "మరి గదే అవ్వా! గీ అప్పయ్య లాట్రీలకు డబ్బులాగం జేత్తుండని పెళ్ళాం ,పిల్లలు ఒక్క తీర్గ తిట్టి సాపిచ్చిండ్రు గద. గిప్పుడు సూడు గా అప్పయ్య దశ దిరిగింది. లాట్రీ తగిలిందవ్వా!"
 "అయితే గాడికి "అడ్డిమార్ గుడ్డి దెబ్బొతికె" లాట్రీ తగిలిందా ఏంది?"
 "ఔనవ్వా!నువ్వన్నట్టే గాడికి యాభై లచ్చల లాట్రీ తగిలిందట. ఇంగ ఇంట్లె ఒక్క సంబురం గాదుపో!"
"ఇంతకీ అడ్డిమార్ గుడ్డి దెబ్బ"అంటేందవ్వా? భలేగన్నవు!"
"ఆఁ  ఏముంది శెల్లె ! గీత లాట్రీ టికెట్లు కొనుళ్ళన్ని అడ్డిమార్ గుడ్డి దెబ్బలె. అంటె ఏదో ఒకటి తగల్క పోద్దాని కొట్టిన గురి లేని దెబ్బలొతికె అన్న మాట!"
"అవ్వోవ్! సయిమానికి మంచిగ మతికి జేసినవ్. మా అన్న కొడ్కు ఉత్త అత్తెసరు సదువులోడు.గాడు మొన్న రాశిన గదేందో పోటీ పరీచ్చల పాసైండంట. గాడికి మంచి దాంట్లె సద్వుకునే అవకాశం వొత్తదంట.గాడికి రాడమేందని ఊల్లె అందరు ముక్కునేలేస్కుంటుండ్రు.గట్ల కట్టపడకుండ,ఎవలూ ఊయించకుండ కల్సొచ్చుడును గిట్లనే అంటరు."
నిజమేనవ్వా! నిన్న పంచాతి ఎలచ్చన్లు అయినయి గద! గందులో ఓటుకు నోట్లు పంచినోడేమో శిత్తు శిత్తుగ ఓడిండు."అడ్డిమార్ గుడ్డి దెబ్బొతికె" ఓ పాలి పోటీ జేసి సూద్దాం ఎట్టుంటదో అన్కున్నోడేమో గెల్శిండు.
గివన్ని యింటున్న బుడ్డోడు అవ్వా! అవ్వా! నేను సుత "అడ్డిమార్ గుడ్డి దెబ్బొతికె" జాంచెట్టుకు రాయిసిరిన ఒక్క దెబ్బకు రెండు జాంకాయలు రాలినవి తెల్సా? అనంగనే...
 "ఒరేయ్ బుడ్డోడా!ఇంకో పాలి గస్మంటి పనులు జేస్నవంటె సూడు ఈపు పగులుద్ది.నువ్విస్రే రాయి ఎవలకన్న తాక్తె  ఇంకేమన్నుందా!తల్కాయ పలిగేది తెల్సా!"
అవ్వ మాటల్కి "'సరే' అవ్వా !గట్లెప్పుడు జేయను నీ మీదొట్టు" అంటుంటే... అందరూ నవ్వబట్టిండ్రు.
గిదండీ సంగతి "అడ్డిమార్ గుడ్డి దెబ్బ" అంటే ఏదో పొరపాట్న కల్సిరావడం అన్న మాట.గట్ల ఎప్పుడూ కల్సొత్తదని పొరపాట్న సుత అనుకోవద్దు.

కామెంట్‌లు