అదిగో పాపం పిచ్చిపిల్ల.!
ఆరిపోతున్న అగ్గి పుల్ల..!
తెలిసీ తెలియక
ఎవరినీ సలహాలు
అడగక తీసుకోక
అమాయకత్వంలో
ఆపుకోలేని ఆవేశంతో
ఏ మాట ఎక్కడ జారిందో…
ఏ చూపు ఎవర్ని గాయపరిచిందో…
ఏ పెద్దతప్పు చేసిందో ఏమో
ఇప్పుడది నిప్పులా దహించి వేస్తోందేమో.
ఎన్ని మాయని గాయాలు చేసిందో
జీవితంలో నా అనుకున్నవారంతా
దూరమైపోయారేమో...
ప్రేమలో ఓడిపోయి ఒంటరైందేమో...
అమ్మానాన్నల మాటలు
గాలివానకు ఆకుల్లా
రాలిపోయాయేమో
ఏ మోసగాడి నవ్వులో
తాను కీలుబొమ్మైపోయిందో…
ఎంత దారుణంగా
ఆశలు తెగిపోయాయో
ఆమెకే తెలుసు—
ఆమె కన్నీళ్లకు తోడుగా
నిలిచిన ఆ దేవుడికే తెలుసు…
అందుకే ఓ చిట్టి తల్లీ
కృంగిపోకు కుమిలిపోకు
నిరాశ పడకు నిట్టుర్చకు
ఇలా కూర్చొని నీడలతో
నీ హృదయాన్ని భయపెట్టకు…
రాత్రి ఎంత గాఢమైనా
ఉషోదయం తప్పదు కదా…?
అందుకే నీ అంతరంగంలో
ఒక చిరుదీపం వెలిగించు…
నీ కలలపై కొత్తకిరణాలు ప్రతిఫలిస్తాయి…
నీ నవ్వు వసంతంలా విరుస్తుంది…
నీ నడకకు బంగారు మార్గాలు పరుస్తాయి
నేటి దూషణలే
రేపు నీకు దీవెనలౌతాయి…
నేటి కన్నీరే
రేపు నీకు కాంతిరేఖౌతుంది
నేడు నిన్ను నిందించినవారే
రేపు నీ విజయానికి హారతిపడతారు
నేడు మ్రోగే నీ పాదాలసవ్వడిని
ఆపాలనుకున్న వారు
రేపు నీ ఖండాంతర ఖ్యాతికి
కలవర పడక తప్పదు
కన్నీరు కార్చక తప్పదు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి