కడుము హైస్కూల్ విద్యార్ధిణి రాష్ట్రస్థాయి రన్నింగ్ లో ఎంపిక

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్ధిణి బీర పల్లవి అరుదైన ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. కాకినాడ జిల్లా, పెద్దాపురం లూథరిన్ ఉన్నత పాఠశాల ఆటస్థలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరుగుపందెంలో ఆమె ఐదో స్థానంలో నిలిచి, తమ పాఠశాలకు గర్వకారణంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలమేరకు, రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ నేతృత్వంలో, రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పల్లవి పాల్గొని ఈ ఘనత సాధించింది. పదహారు సంవత్సరాల బాలికల విభాగంలో రెండు కిలోమీటర్ల దూరం పరుగు పందేల పోటీలకు అర్హత సాధించి, విజేతగా కూడా నిలిచింది. తొలుత శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోడి రామమూర్తి స్టేడియంలో ఈనెల ఇరవై ఒకటో తేదీన పల్లవి పాల్గొని రెండో స్థానంలో గెలుపు సాధించి నేడు రాష్ట్ర స్థాయిలో గెలుపొందుట మిక్కిలి హర్షణీయమని ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. పల్లవికి తర్ఫీదునిచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు యెన్ని రామకృష్ణను కూడా ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు