తల చీకటి తురుముకొని .!!:- చుంచు సంతోష్ కుమార్
సాహితీ కెరటాలు
==============
గోడల నడుమను కాపురాలు
స్వార్థపు జీవితాలై కొన్ని
నడివీదును కాకులై అరుచుకుంటున్నవి
అక్కడక్కడ కొన్ని జీవితాలు
మన సమాజంలో ..!!

జీవం పోసిన పేగు ఒక్కటే
ప్రేమ పంచిన ఓడి ఒక్కటే
కడుపుకు కూడు పెట్టిన చెయ్యి ఒక్కటే
ప్రేమ పంచి పెంచిన తనువు ఒక్కటే
కాపురాలుగా మార్చిన దీవెన ఒక్కటే ..!!

ఒకే తల్లి కన్న బంధాలే ఒకరిపై ఒకరు
కక్షలు పాటిస్తూ కాలం గడుపుతున్నారు
కన్నవాళ్ళను వంతులు వేసుకొని 
పోషిస్తున్నారు ..!!

పట్టింపులే గొప్పవని
పగలే శాశ్వతమని జీవిస్తున్నారు
ఎవరైనా ఒకరు పాడకు చుట్టం కాగానే
నావాలంటూ ఒకటవుతున్నారు ..!!

తల చీకటి తురుముకొని గంగమునగగా
నెత్తి కన్నులు నేల దిగినట్టు
గుర్తు చేసుకుంటున్నారు
మనం ఒకే పేగు బంధమని
కలిసి బ్రతకాల్సిన జీవితాలు
కక్షలతో బ్రతికేస్తున్నారు కొందరు
మన సమాజంలో ..!!
________

కామెంట్‌లు