భారతీయ సనాతన ధర్మానికి మూలాధారమైన వేదాలను సామాన్యులకి సులభతరం చేయడం కొరకు వాటిని విభజన చేసిన మహర్షి వ్యాసుడు. అలా వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, ఐదవ వేదంగా “మహాభారతం” గా రచించాడు.
ఆ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో అంతర్భాగమైన శాంతి పర్వం లోనిది “విష్ణు సహస్రనామం”. విష్ణు మూర్తి ని నారాయణుడని, అనంతుడని, అచ్యుతుడని..ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక వ్యక్తి గురించిన గొప్పతనం చెప్పాలంటే, వారికి ఉన్న లక్షణాలని వివరించే అనేక విశేషణాలని వాడతాము. ఆ విశేషణాలే ఆయన పేర్లు అవుతాయి. అలా ఈ జీవ సృష్టి అంతా ఆయన దగ్గరే మొదలైంది.
బ్రహ్మ దేవుడు సృష్టి కర్త అని మనందరం అనుకుంటూ ఉంటాము. కానీ ఆ బ్రహ్మ గారు కూడా మహా విష్ణువు నాభి కమలం నించి పుట్టాడు.
తన అనంతమైన శక్తితో అన్ని చోట్లా, అన్ని రూపాలతో వ్యాపించి ఉన్నాడు కనుకనే ఆయనని నారాయణుడు అంటున్నాము. దేవ భాష అయిన సంస్కృతంలో “నారా” అంటే వ్యాపించి ఉండటం అన్నమాట.
అలా అన్ని చోట్ల వ్యాపించి ఉన్న చైతన్య రూపమైన శ్రీ మహా విష్ణువుకి ఉన్న సహస్ర నామాల గురించి రోజు కొంచెం కొంచెం చొప్పున కథల రూపంగా తెలుసుకుందామా?
విష్ణు సహస్ర నామాలు కొన్ని తేలికగా పలకటానికి ఉంటే.. కొన్ని ద్విత్వాక్షరాలతో మరి కొన్ని సంయుక్తాక్షరాలతో ఉంది పలికేటప్పుడు కొంచెం కఠినంగా అనిపిస్తాయి. కానీ స్వామి కరుణ, అనుగ్రహం.. అందులో అంతర్లీనంగా ఉండే భావం కథలుగా మనం అర్థం చేసుకోగలిగితే అవి తేలికగా పలకటం నేర్చుకోగలుగుతాము.
రోజు ఒక కథగా నేర్చుకోవటం ప్రారంభిద్దామా…
@@@@@
ఎనిమిదో క్లాస్ చదువుతున్న వికాస్ హాల్లో హోమ్ వర్క్ చేసుకుంటున్నాడు. తనకి పాఠంలో తెలియని విషయం అడగటానికి అమ్మ దగ్గరకి పరుగెత్తుకొచ్చాడు. అమ్మ కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకుంటున్నది. శ్రావణికి రోజు సాయంత్రం దీపం వెలిగించి దైవ ప్రార్థన చెయ్యటం అలవాటు. వికాస్ అమ్మ పక్కనే కూర్చుని ఆమెని గమనించసాగాడు.
అమ్మ మనసులో ఏమైనా చదువుకుంటున్నదా? లేక ఊరికే కళ్లు మూసుకున్నదా? అనే సందేహంతో, ఎప్పడు కళ్లు తెరుస్తుందా అని ఎదురుచూస్తున్నాడు.
కొంత సేపయ్యాక..శ్రావణి అరచేతులు రెండు ఒక దానితో ఒకటి మెల్లగా రుద్ది కళ్ళ మీద ఉంచుకుని, నమస్కరించి నెమ్మదిగా కళ్ళు తెరిచింది.
“అమ్మా నువ్వు రోజు ఇలా చేస్తావు కదా! ఏ దేవుడిని ప్రార్థిస్తావు. నోట్లోనే ఏమైనా అనుకుంటావా? నాకు చెప్పవా” అని అడిగాడు.
“నేను పూజ్యుడైన శ్రీ మహావిష్ణువుకి ఉన్న ‘అచ్యుత’, ‘అనంత’ ‘గోవింద’ అనే నామాలని మనసులో అనుకుంటూ ఉంటాను” అన్నది.
“అనంత అంటే ఏంటి” అన్నాడు వికాస్.
“అనంత అంటే అంతం లేనిది అని అర్థం. అంటే భగవంతుడికి ఒక చెట్టుకు, భవనానికి, నదికి ఉన్నట్టు ఆది, అంతం లేవు. అంటే మొదలు, చివర లేవు అన్నమాట. ఉదాహరణకి ఆయన మరొక రూపమైన గాలి, సూర్య రశ్మి అన్ని చోట్ల ఉంటాయి. ఆయనకి మన మీద చెప్పలేనంత ప్రేమ, దయ తెలుసా! అందుకే మనకి సుఖంగా బ్రతకటానికి కావలసిన అన్ని సమకూరుస్తున్నాడు” అన్నది.
“అవన్నీ నాన్నగారు, నువ్వు డబ్బులతో కొంటున్నారు కదా! ఇందులో దేవుడు ఎవరు? ఆయన చేసేదేముంది” అన్నాడు వికాస్.
“అసలు మనకి ముందు డబ్బు ఎక్కడి నించి వస్తున్నది. ఉద్యోగం చేస్తే..అవునా? మరి ఉద్యోగం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పక్కింటి వేణు అంకుల్ వాళ్ళ తమ్ముడు ఉద్యోగం దొరకక ఎన్నాళ్ళ నించి తిరుగుతున్నాడో నీకు తెలుసు కదా! నాకు, నాన్నగారికి ప్రయత్నం చెయ్యగానే ఉద్యోగం దొరికింది. ఉద్యోగం వల్ల జీతాలు వస్తున్నాయి! ఆ డబ్బులతో బజార్ నించి సరుకులు, బట్టలు, బొమ్మలు, పుస్తకాలు కొనుక్కుంటున్నాము. నువ్వు స్కూల్లో చదవటానికి ఫీజు కడుతున్నాము. డబ్బులున్నా బజార్ లో మనకి అవసరమైన సరుకులు దొరక్కపోతే కొనలేము కదా! అలా ఇక్కడే కాదు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో..భూమండలం అంతా అందరికీ అన్నీ దొరుకుతూ అందరమూ జీవితం సుఖంగా గడపగలుగుతున్నామంటే అనంతుడైన భగవంతుడికి మన పట్ల ఉన్న కరుణే కారణం.”
“అంతే కాదు. విస్తారంగా ఉన్న నీరు, భూమి కూడా భగవంతుడి అనంత రూపాలే” అన్నది శ్రావణి.
“అర్థం అయిందమ్మా. అయితే రేపు ఇంకొక నామం గురించి కూడా ఇలాగే చెప్పు” అని తన హోమ్ వర్క్ లో వచ్చిన సందేహం తీర్చుకుని చదువుకోవడానికి వెళ్ళిపోయాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి