అంబేద్కర్…
ఆర్జించిన ఆస్తి...
ఆవుపాలల్లో నెయ్యే…
ఆయన త్యాగం...
ఆకాశంలో వెలిగే తారకయే...
ఆయన జ్ఞానం...
అగాధమౌ జలనిధిలో ఆణిముత్యమే...
ఆయన పోరాటం...విశ్వమంతా
వెలుగుల్ని నింపే ఉషోదయ కిరణమే...
ఆయన ఆలోచన...పొంగే ఆకాశగంగే…
తరతరాలుగా
అణచివేయబడి అణగారిన
పీడిత తాడిత బడుగు బలహీన
బహుజన చీకటి హృదయాల్లో
ఆశాకిరణమై ఆరనిదీపమై వెలిగి...
వారి ఆత్మగౌరవం కోసం…
హక్కుల పరిరక్షణ కోసం...
సంఘంలో సమానత్వం కోసం…
తన జీవితాన్ని ఫణంగా పెట్టిన...
ఒక పవిత్ర అగ్నిశిఖ మహానుభావుడు.
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్.
కుటుంబాన్ని వెనక్కు నెట్టి…
భార్యాబిడ్డల సంతోషాన్ని త్యజించి…
ఉన్నత పదవుల్ని…
సిరిసంపదల్ని ఆశించక...
విదేశాల్లో ఉద్యోగాన్ని...
బంగారు అవకాశాల్ని...
కాదని కాలదన్ని...
మట్టిబతుకుల పక్కన నిలిచిన
నిప్పులా నడిచిన నిస్వార్థపరుడు
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్.
విలాసాన్ని వదలి…
ప్రజల కన్నీటిలో
తన ప్రతిబింబం చూసిన
పుణ్యమూర్తి…
ధర్మదీక్షాపరుడు…
విప్లవ దీప్తి…
దళితజనబాంధవుడు
జ్ఞాన సూర్యుడు…
సంఘ సంస్కర్త…
నీతికి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్.
మహా మేధావి
మహా నేత స్పూర్తి ప్రదాత
భారత రాజ్యాంగ నిర్మాత
భారతమాత ముద్దుబిడ్డ…
భారత రత్న…బోధిసత్వ…
అందరికి ఆయనే శరణం...
అణగారిన ప్రజల ఆశాకిరణం.
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్.
అట్టి త్యాగమూర్తిని స్మరించుకోవడం
మన పుట్టుక పెట్టిన ఋణం…
మన రక్తంలో ప్రవహించే ధర్మం…
బుద్ధం శరణం గచ్ఛామి…
ధర్మం శరణం గచ్ఛామి…
సంఘం శరణం గచ్ఛామి…
కులమత రహిత
నవ సమాజ నిర్మాణం గచ్ఛామి...
అంటూ ప్రతిహృదయం ప్రతిజ్ఞ చేయాలి...అదే
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ కి
ఘనమైన...నిజమైన నివాళి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి