పది నాణేలు పోతేనేం?: - యామిజాల జగదీశ్
 ఒకరోజు ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ఒక ప్రశ్న అడిగారు.
"మీ దగ్గర 86,400 నాణేలు ఉన్నాయనుకోండి.... వాటిలో ఓ 10 నాణేలను ఒకడు దొంగిలించి పారిపోతే, మీరు 86,390 నాణేలను వదిలేసి ఆ 10 నాణేలకోసం పరిగెడుతారా? 
లేదా పర్వాలేదులే పది నాణేలేగా పోయాయి....పోతేపోనీ అని అనుకుని 86,390 నాణేలతో సరిపెట్టుకుం టారా?" అని.
విద్యార్థులందరూ తాము 10 నాణేలను వదిలివేస్తామని బదులిచ్చారు. తమ వద్ద మిగిలివున్న  86,390 నాణేలను పదిలపరచుకుంటాం అని చెప్పారు.
అప్పుడు గురువుగారు ఇలా అన్నారు : సెభాష్....బాగానే చెప్పారు.‌ కానీ నిజానికి, చాలా మంది ఇందుకు విరుద్ధంగా ఉంటారు. దొంగ ఎత్తుకుపోయిన 10 నాణేల కోసం, మిగిలిన 86,390 నాణేలను పక్కన పడేస్తారు. అంతేకాదు, వాటినీ కోల్పోతారు.
గురువుగారి మాటతో ఆలోచనలో పడిన విద్యార్థులు  : "ఎవరైనా అలా చేస్తారా? అది ఎలా సాధ్యం?" అని అడిగారు.
అప్పుడు గురువుగారు ఇలా అన్నారు : నిజానికి 86,400 అనేది ఏమిటంటే ఒక రోజులోని సెకన్లు.
ఎవరైనా మిమ్మల్ని 10 సెకన్ల పాటు బాధపెడితే లేదా బాధ కలిగించే మాటలు చెప్పినా లేదా ఏదైనా చేదు సంఘటన జరిగితే, చాలా మంది మిగిలిన 86,390 సెకన్లను పోగొట్టుకున్న పది సెకండ్ల గురించి ఆలోచిస్తూ వృధా చేస్తారు. ఇది సరికాదు. కొన్ని నిమిషాల బాధతో మిగిలిన రోజునంతా వృధా చేసుకోకూడదు. జీవితం ఒక బహుమతి. పై సంఘటనతో ఓ విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే పది సెకన్లు బాధను తలుస్తూ మిగిలిన సమయాన్ని వృధా చేసుకోకూడదన్నారు. 
ఇది విద్యార్థులకు మాత్రమే కాదు, మనకు కూడా వర్తిస్తుంది.

కామెంట్‌లు