సుప్రభాత కవిత : - బృంద
తలపులతో తీరిక గా చెక్కి 
చిరునవ్వుల నగిషీలు  చేసి 
మురిపాల రంగులు వేసిన
రూపులేని మందిరానికి
దైవం ఎవరు?

నలువైపులా  గోడలపై 
మమతల అద్దాలు పొదిగి 
ఎటుతిరిగినా ఒకటే రూపం 
కనులవిందు చేసి కమ్మగా
కరుణగా కనిపించేదెవరు?

లెక్కలేనన్ని కోరికలను 
చక్కగా మాలలు అల్లి 
తక్కిన వారికన్నా ముందు
మొక్కవోని ఆరాధనతో
మొక్కులు చెల్లించిదెవరికి?

పరవశంతో పొంగే భక్తి  భావనల

అగరుపొగలుఅలుముకుని
ఆనందంగా ఆహ్వానం అందుకునే 
అంతరంగ మిత్రుడెవరు?

ఆశల పందిరిపై పూచిన 
అందమైన అరవిందాలను 
అర్చనకై సమకూర్చి
ఎదురుచూసే దెవరికోసం?

గలగల నవ్వే గడ్డిపువ్వునైనా 
కరువుతీరా కరుణించి
మనుగడ మధురం చేసే
జగములనేలే జగదేకపతి
మహనీయ మూర్తి  మరీచునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు