పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, పుస్తక మహోత్సవ ప్రశంసాపత్రంతో సత్కారం పొందారు. పార్వతీపురం జిజెకాలేజీ గ్రౌండ్ లో పుస్తక మహోత్సవ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన మాటల మాధుర్యం అనే బాలకథాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న తిరుమలరావును అభినందిస్తూ, నిర్వాహకులు ప్రశంసాపత్రం బహూకరించారు.
సమాజ హిత మాన్యం పార్వతీపురం మన్యం అనే స్వీయ గీతాన్ని ఆలపించిన తిరుమలరావు, పెక్కు ప్రశంసలు అందుకున్నారు. సభాధ్యక్షులు సాహితీలహరి అధ్యక్షులు మంచుపల్లి శ్రీరాములు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, మాటల మాధుర్యం రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బెలగాం భీమేశ్వరరావు, ముఖ్య వక్త బెహరా ఉమా మహేశ్వరరావు, పుస్తక పరిచయ కర్త కిలపర్తి దాలినాయుడు, సమీక్షకులు గుడ్ల అమ్మాజీ, సాహితీవేత్త బి.వి.పట్నాయక్, ప్రముఖ చిత్రకారులు సినీ గేయ రచయిత తుంబలి శివాజీల చేతులమీదుగా తిరుమలరావు ఈ సత్కారం పొందారు. ఈ కార్యక్రమంలోనే ఆవిష్కరించబడిన శంకరయ్య శతకం పుస్తకరచయిత బౌరోతు శంకరరావు, ప్రముఖ రచయితలు బి.వి.గణేశ్వరరావు, గారాల సూర్యనారాయణ, కనపాక చౌదరినాయుడు, నాగిరెడ్డి గౌతమి, ఎం.శంకరరావు, గొట్టాపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్, విజయవాడ బుక్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం గతనెల ఇరవై ఐదో తేదీన జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిచే ప్రారంభం కాగా, ఈనెల ఐదో తేదీ వరకూ లక్షకు పైగా పుస్తకాల ప్రదర్శన, క్రయవిక్రయాలు, పుస్తకావిష్కరణలు, సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంద్రజాలాలు, టెలిస్కోప్ ద్వారా అంతరిక్ష వీక్షణలు, పాడుదమా స్వేచ్ఛా గీతం రచయిత గంటేడ గౌరునాయుడు సమక్షాన ఏకకాలంలో వేయిమందితో ఆ గీతం బృందగానంతో పాటు ప్రతీరోజూ కవి సమ్మేళనాలు జరుగుచుండగా నేడు తిరుమలరావు ఆలపించిన మన్యం జిల్లా సమగ్ర సమాచారంతో కూడిన స్వీయగీతం అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవల నిర్వహించిన సిక్కోలు పుస్తక మహోత్సవాలలో కూడా తిరుమలరావు భారత రాజ్యాంగం గూర్చి స్వీయ గీతాన్ని ఆలపించి సభాసదుల ప్రశంసలు పొందుట విశేషం. తిరుమలరావుకు పుస్తక మహోత్సవ ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి