ఆడించే దోమలు : - అనురాధ బొడ్ల (సముద్రాల)- 9989566696
 

ఇవాళ వాకింగ్ వెళదామనుకున్నప్పుడల్లా ఏవో ఆటంకాలు వచ్చి, ఇలా కిందికి వచ్చేసరికి సాయంత్రం ఏడయింది. జనం అక్కడక్కడా చెదురుమదురుగా ఉన్నారు. కాఫీ బండి దగ్గర, స్నాక్స్ స్టాల్ దగ్గర కూడా ఒకరిద్దరే ఉన్నారు. ఒకరిద్దరు వాకింగ్ చేస్తూ కూడా కనపడ్డారు. అలా అందరినీ చూస్తూ ర్యాంప్ ఎక్కి, పైకి నడిచాను. 
వాతావరణం ఉక్కగా ఉంది. గాలి ఏమాత్రం లేదు. దానికి తోడు, చిటచిటా దోమలు కుట్టటం తెలుస్తుంది. అయ్య బాబోయి! దోమల టైం మొదలయింది. ఇక్కడ ఎండాకాలం అంతగా ఉండవు కానీ, కాస్త వర్షాలు పడగానే, దోమలు కొద్ది కొద్దిగా ఎక్కువవుతాయి. 
అనవసరంగా వచ్చాను, ఇవాళ ఊర్కోవాల్సింది వాకింగ్, అనుకుంటూ నడుస్తుండగా నా ముందు 
నడిచే వాళ్ళని చూసి నవ్వు వచ్చింది. ఇక్కడ దోమల టైంలో వాకింగ్ చేస్తే కాళ్ళతో పాటు, చేతులకు వ్యాయామమూ, మసాజ్ రెండూ దొరుకుతాయి. ఎలా అంటారా?
నా ముందు, అల్లంత దూరంలో ఒక అతను వాకింగ్ చేస్తూ రెండు చేతులూ కారు వైపర్స్ లాగా ఆడిస్తూ వెళుతున్నాడు, దోమల్ని తోలుతూ. నా ముందే ఉన్న ఒక అమ్మాయి కూడా చేతులు అలాగే ఊపుతూ, నడుస్తూ ఉంది. అంతలోనే, కాస్త గట్టిగా చెయ్యి విదిలించిందేమో, చేతిలోని ఫోను కింద పడేసుకుంది. 
అలా వాళ్ళని దాటి వెళితే, మరొక అమ్మాయి, రెండు చేతులనూ లెఫ్ట్ కి ఆ తరువాత రైటుకీ ఊపుతుంది. ఆ చేతులతో పాటు తన నడుమూ ఊగుతుంది. చేతుల వ్యాయామంకై ఊపుతుందో లేక దోమలకే ఊపుతుందో కానీ, వెనకనుంచి చూసే వాళ్ళకి తను డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. 
ఇక నేను ఇవన్నీ చూస్తూ నవ్వుకుంటూనే నా చేతులూ ఊపుతూ, దోమలు కుట్టిన చోట రుద్దుకుంటూ నడుస్తున్నా. అలా నా చేతులకూ వ్యాయామమూ మసాజ్ రెండూ అవుతున్నాయి. 
సరే, అలా దోమల బాధితులనూ, వాకింగ్ విన్యాసాలనూ చూస్తూ నడుస్తుండగా, అక్కడక్కడా బెంచీల మీద ఇద్దరు ముగ్గురు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నా మనసులో ఒక పెద్ద అనుమానం రానే వచ్చింది. వాళ్ళు అలా ప్రశాంతంగా ఎలా కూర్చున్నారు? వాళ్ళని దోమలు కుట్టట్లేదా? సర్లే అనూ, వాళ్ళేదైనా మస్కిటో రెపెల్లెంట్ ప్యాచెస్ పెట్టుకునో లేదా ఏదైనా ఒడోమస్ లాటివి పూసుకుని వచ్చారేమో! అందులో వింత ఏముంది అన్నది మనసు. 
అయ్యుండొచ్చేమో, పాజిబుల్. కానీ ఎందుకో నమ్మబుద్ది కాలేదు. పిల్లల మీద ఉన్న శ్రద్ద పెద్దవాళ్ళకి సాధారణంగా తమ మీద తమకి ఉండదు. తమ గురించి, అంత జాగ్రత్తపడి వచ్చారంటే…, అనుమానమే! 
హేయ్, వెయిట్! దోమల గురించి ఈ మధ్య కాలంలోనే ఎక్కడో డిస్కస్ జరిగింది కదా, అన్నది మనసు. అవును, మొన్ననే మా చెల్లి వాళ్ళింట్లో, సిబ్లింగ్స్ అందరం కలిసినప్పుడు ఈ దోమల టాపిక్ వచ్చింది. చాలా సేపు మాట్లాడుకున్నాం వాటి గురించి. ఆడదోమలు, అందులోనూ రిప్రొడక్టివ్ టైంలో మాత్రమే అవి మనుషులను కుడతాయనీ, అది కూడా O టైప్ బ్లడ్ వాళ్ళనే ఎక్కువగా కుడతాయనీ అన్నారు. అంటే, ఒక నలుగురయిదుగురు కలిసి కూర్చుంటె, అందులో ఒకవేళ, O టైప్ బ్లడ్ గ్ర్రూపు వాళ్లు ఉంటే, దోమలు వాళ్ళని మాత్రమే కుడతాయట. మిగిలిన వాళ్ళని ఏమీ చెయ్యవట. ఇక మగ దోమలు అసలు ఎవరిన్నీ కుట్టవట.
ఓహ్, అయితే ఇక్కడంతా ఆడదోమలే ఉన్నాయా? మరి అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఆడ దోమలు లేవా? లేదూ, వాళ్ల బ్లడ్ గ్రూప్ వేరేనా? అంటే O టైప్ కాదా? అందుకే వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నారా?  అయ్యుండొచ్చు. 
ఇలా ఆడ దోమలు వీర విహారం చేస్తుంటే మగ దోమలు ఏం చేస్తూ ఉంటాయి? ఈ ఆడ దోమల కోసం వంట చేస్తూ ఉంటాయా ? అబ్బే , వీటికి ఇంకా వంట ఎందుకు? ఇక్కడే శుభ్రంగా పొట్ట నింపుకుని వెళ్తాయిగా!
     అమ్మో! ఇవి ఆడ దోమలా? ఆడించే దోమలా? ఇక కమ్యునిటీలో, అక్కడక్కడా బోర్డులు పెట్టమని ఒక రిక్వెస్ట్ పెట్టాలేమో - People with O Type Blood - No Walking After Six! అని.
కామెంట్‌లు