శీతాకాలమే
భరించలేని చలే
తప్పదు, తట్టుకోవలసిందే
అయినా
భూమాతకు
ఆమె స్వెట్టర్ అల్లుతోంది
ఓ సుందరి
భూమ్మీద
చుక్కల కవిత రాయడాన్ని
చూసి ఆస్వాదిస్తోంది
ఆకాశం
చుక్కలను
ఆమె కలిపే తీరుని
నా మనసు
రెప్పార్పక చూస్తూ
ఉండిపోయింది
నెల పొడవునా
వేర్వేరు ముగ్గులు
వేసే లలనా,
నేను మాత్రం
చుక్కల్లో చుక్కగా మిగిలిపోయాను
కదలక మెదలక
నీ కళాభిమానాన్ని
వీక్షిస్తున్నాను
తరిస్తున్నాను
ఎన్ని చుక్కలో
ఎన్ని వంపులో
నన్ను స్పృశిస్తూ
ముగ్గులు చీర కడుతున్న
ఈ భామామణికి ఏమివ్వాలని
భూమాత ఆలోచనలో పడింది
ఆమె రెండు వేళ్ళ నుంచి
నేలను తాకే పిండి
అందమైన ముగ్గై
చూస్తున్న వారందరినీ
కట్టి పడేస్తోంది
ముగ్గు వేయడం
పూర్తయ్యాక ఆమె లేచి నిల్చుని
ఒక్కసారి
తదేకంగా చూస్తుంది
అలా చూడటంలోనూ
ఓ అందముంది...
ఎంతానందమో నా మనసుకి
అని అనుకుంటుంది భూమాత
ముగ్గెలా ఉందని
అడుగుతున్నట్టు
ఉంటుందా చూపు
సెభాష్ అని ప్రశంసించటం తప్ప
ఇంకేం చెప్పగలనంటోంది
భూమాత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి