మనిషి ప్రవహించే నది… :- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
జీవితం
కమ్మని కలలు కంటుంది…
ఆ కలలకు కళ్లే
పచ్చని పొదరిల్లు.
కడలి కనే కలలే అలలు
ఆ అలలు ఆశల పిట్టల్లా 
తపిస్తాయి తీరం దాటాలని 
ఇసుకతిన్నెలపై ఇల్లు కట్టుకోవాలని
కానీ తెలియదు…పాపం 
అలల పయనం తీరంవరకే పరిమితమని

ఆకాశపు అంచుల్ని తాకాలని  
ఎగిసిపడే ఏ అల తీరం దాటదు.
నీటితరంగాల్లో పుట్టిన అలలు
క్షణంసేపు ముత్యపు నురగల్లా మెరిసి 
ఆపై నిశ్శబ్దంగా నీటిలో కనుమరుగౌతాయి

నదులు ఎక్కడో
కొండల్లో కోనల్లో పుట్టి,
రేసుగుర్రాల్లా దూసుకెళ్లి
కడకు కడలి ఒడిలో ఒరిగిపోతాయి 

మనిషీ కూడా అంతే ఈ లోకానికి
ఒక అనుకోని అతిథిగా వచ్చి
బంధాల సంకెళ్లు తెంచుకొని
ఓ బహుదూరపు బాటసారిగా 
ఒంటరిగా సుదూరతీరాలకు చేరతాడు 

కమ్మని కలలు కంటూ కన్నుమూసి
కారుచీకటి ఊబిలోకి జారిపోతాడు
మట్టివాసన పీల్చిన ఈ మట్టిమనిషి
మళ్లీ మట్టిలో కలసి మాయమౌతాడు

ఆత్మ పరమాత్మలో లీనమై
నింగిని చేరి నిర్మల నిశ్చల 
నిశీధిలో నిలిచిపోతాడు
ఓ ధృవతారగా వెలిగిపోతాడు



కామెంట్‌లు