తలవాకిట నిలుచున్న
తెల్లవారి వెలుగులు చూసి
ఇల కౌగిలి వీడి పరుగిడిన
నల్లని తిమిరపు తెరలు
నిదురించిన లోయలలో
జలదరించి మేలుకున్న
జలపాతాల పరుగులు పాడే
గలగలల సంగీతాలు
సడిచేయక సన్నగ వీచే
తడి నిండిన చల్లని గాలి
ఒడి చేరిన బిడ్డకు మల్లే
పుడమిని తడిమే సరాగాలు!
పుట్టెడు ఆశలతో రేపటికై
ఎదురుచూచు తండ్రిలా
తూరుపు పై చూపు నిలిపి
ఎదురుచూచు గిరులు
ఏ కానుక తెచ్చేనో
ఏ మార్పులు చేసేనో
ఏ వేడుక ఎదురౌనో
ఏ కోరిక తీర్చేనో...
ఎవరి కొంగును
బంగారం చేసేనో...
ఎవరి మనసుకు
ఎనలేని శాంతిని ఇచ్చేనో....
శాసించే కాలానికి
దాసోహం అనమంటూ
శ్వాసించే వరమిచ్చి
కాసింత కరుణ పంచే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి